
వాషింగ్టన్: భారత్ పట్ల పక్షపాత ధోరణితో వార్తలు రాస్తున్నారంటూ అమెరికన్ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్ విరుచుకుపడ్డారు. ప్రతిష్ఠాత్మకమైన వాషింగ్టన్ పోస్ట్‌తో సహా మొత్తంగా మీడియా అంతా భారత్ వ్యతిరేక వైఖరి అవలంబిస్తోందంటూ విమర్శించారు.
అమెరికాలోని భారతీయులు వాషింగ్టన్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జైశంకర్ మాట్లాడుతూ భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మానుకోవాలని అమెరికన్ మీడియాకు హితబోధ చేశారు. ‘‘ఈ పోటీ ప్రపంచంలో వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది ప్రజలు తెలుసుకోవాలి. వారిని మనం విద్యావంతులను చేయాలి’’ అని అమెరికన్ మీడియాను ఉద్దేశించి మంత్రి చెప్పారు.
అమెరికాలో భారత్ వ్యతిరేక శక్తులు పెరుగుతుండడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన, ”ఇక్కడ వివక్ష లేదా పక్షపాత ధోరణులు ఉన్నాయన్నది నా ప్రధానమైన పాయింట్. భారతదేశానికి సంరక్షకులమని కొంతమంది భావిస్తుంటారు. కానీ, వారికి భారత ప్రజల హృదయాల్లో చోటు వుండదు. అందువల్ల వారు బయట నుండి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తూ వుంటారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: Nijamtoday





