News

గొలగముడిలో అంగరంగ వైభవంగా వేంకటేశ్వర స్వామి సమారాధన

251views

* వేలాదిగా పాల్గొన్న యానాది సోదరులు

ర్వ జనుల సంక్షేమం కోరే మన హైందవ ధర్మం ప్రపంచానికే ఆదర్శవంతమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ విజయాదిత్య అన్నారు. గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమ ప్రాంగణంలో శనివారం యానాదుల జాగరణ వేదిక, సింహపురి వైద్య సేవాసమితి, టీటీడీల సంయుక్త ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి వారికి యానాదుల మూడో సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం 10 గంటలకు భక్తులు స్వామివారికి ముడుపులు చెల్లించారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యానాదులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సాయంత్రం పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నరసింహారెడ్డి, ప్రత్యేక పోలీసు డీఐజీ చౌటూరు వెంకటేశ్వర్లు, అమరావతి శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, నెల్లూరు నగర మేయర్ పోట్లూరు స్రవంతి, వీహెచ్పీ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు తదితర ప్రముఖలు హాజరై, యానాదుల సమారాధన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వేంకటేశ్వర స్వామి వారికి యానాదుల సమారాధన కార్యక్రమాన్ని మూడో దఫా అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

హైందవ ధర్మం సమున్నతమైందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని ముఖ్య వక్త ఆదిత్య గుర్తుచేశారు. విశిష్టమైన జీవనశైలి కలిగిన గిరిజనులు తమ జీవన విధానాన్ని మరింత మెరుగు పరుచుకోవాల్సి ఉన్నదని, గిరిజనులకు ప్రభుత్వాలు కల్పించిన హక్కులను తెలుసుకోవడానికి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని సూచించారు. ఆర్థిక, సాంఘిక అసమానతలను దూరం చేయగల శక్తి చదువుకు మాత్రమే ఉందని చెప్పారు. అనంతరం యానాదులు కోలాటాలు, భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రాత్రి నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది.

హైలైట్స్ :

* ఈ కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది భక్తులకు నిర్వాహకులు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు.

* స్వామివారికి చేసిన అలంకరణ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.

* ఆరాధన మొదలవడానికి ముందు సోది చెప్పించే ఆచారం యానాదులలో ఉంది. అలాగే ఈ ఆరాధన సందర్భంగా కూడా సోది ఏర్పాటు చేశారు. సోది చెప్పే వ్యక్తికి సాక్షాత్తూ స్వామివారే ఆవహిస్తారని నమ్మకం. సోది చెప్పే వ్యక్తి ఆరాధనోత్సవం నిరాఘాటంగా జరుగుతుందని చెప్పారు. ఇంతలోనే వర్షం ప్రారంభమైంది. “అయ్యో…. వాన మొదలయ్యింది ఏమి చెయ్యాలి స్వామీ?” అంటూ భక్తులు స్వామి ఆవహించిన సోది చెప్పే వ్యక్తిని వేడుకున్నారు. ఈశాన్యం దిక్కున హారతివ్వవలసిందిగా సోది చెప్పే వ్యక్తి భక్తులను ఆదేశించాడు. ఆ మాట ప్రకారం భక్తులు ఈశాన్యంలో హారతివ్వగానే వర్షం ఆగిపోయింది. ఆనందోత్సాహాలు, భక్తి ప్రపత్తుల మధ్య భక్తులు “గోవిందా… గోవిందా…” అంటూ చేసిన గోవింద నామ స్మరణతో గొలగముడి క్షేత్రం ప్రతిధ్వనించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.