
* ఖాయమంటున్న రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్
* భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా వెలువడని అధికారిక ప్రకటన
ఉజ్బెకిస్థాన్ వేదికగా గురువారం (సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
”22వ ఎస్‌సీవో సదస్సుకు పుతిన్, భారత ప్రధాని మోడీ హాజరుకానున్నారు. సదస్సులో భాగంగా ఈ దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్యసమితి, జీ20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి అజెండాలో ఉండే అవకాశం ఉంది. డిసెంబరులో ఐరాస భద్రతా మండలికి, 2023లో జీ20, ఎస్‌సీవోకు భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో ఈ ద్వైపాక్షిక భేటీకి ప్రాముఖ్యత ఏర్పడనుంది” అని క్రెమ్లిన్ అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే మోడీ, పుతిన్ భేటీపై భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో మోడీ – పుతిన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. ఉక్రెయిన్ పై సైనిక చర్య ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న పుతిన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యా అధ్యక్షుడిని కోరారు. ఆ తర్వాత ఈ ఏడాది జులైలో మరోసారి పుతిన్ తో మోడీ ఫోన్ లో సంభాషించారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాలపైనా ఇద్దరు నేతలూ తమ ఆలోచనలు పంచుకొన్నారు. గతేడాది డిసెంబర్‌లో పుతిన్ భారత్ లో పర్యటించిన సందర్భంగా తీసుకొన్న నిర్ణయాల అమలుపై సమీక్షించారు.





