
బెంగళూరు: మంగళూరులో రూ 3,800 కోట్ల వ్యయం కాగల పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో రెండు రోజుల క్రితం మంగళూరు పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా సమావేశంపై ఆయన ఎన్నికల సన్నాహాలు గురించి చర్చించారు.
“డబల్ ఇంజిన్” అభివృద్ధి అజెండాతో ప్రజలోకి వెళ్ళాలని సూచించారు. ప్రాంతాల వారీగా పార్టీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తే తాను పాల్గొంటానని హామీ ఇచ్చారు. కనీసం నెలకు ఒకసారి కర్ణాటకలో పర్యటించి, ఎక్కడో ఒక చోట బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించాలని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడ్డియూరప్పా ప్రధానిని కోరారు.
మంగళూరులో తన అధికారిక కార్యక్రమం సందర్భంగా జరిగిన బహిరంగసభలో పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఓ ప్రభుత్వ కార్యక్రమంపై ఆ విధంగా హాజరు కావడం గొప్ప విషయమే అని చెప్పారు. కర్ణాటక ప్రజలు ఇంకా బిజెపి పట్ల సానుకూలంగా ఉన్నట్టు సంకేతం అని కూడా తెలిపారు.
జులై 26న యువమోర్చ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య తర్వాత పార్టీ కార్యకర్తలలో ఆగ్రవేశాలు చెలరేగిన అనంతరం మంగళూరులో ప్రధాని కార్యక్రమం విజయవంతం కావడం కోస్తాప్రాంతంలో బిజెపి పట్ల ప్రజలలో లభిస్తున్న ఆదరణకు నిదర్శనం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహితం సంతృప్తి వ్యక్తం చేశారు.
Source: Nijamtoday





