
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్‌లోని రష్యా దౌత్య కార్యాలయంపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దౌత్యవేత్తలు సహా 20 మంది మృతి చెందారు.
దౌత్యవేత్తల మరణాన్ని రష్యా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఏ నొవొస్టీ ప్రకారం కాబుల్‌లోని దౌత్య కార్యాలయం బయట ఈ పేలుడు జరిగింది. కాబుల్‌లోని దారుల్‌మాన్ రోడ్డులోని ఈ కార్యాలయం వద్ద వీసాలకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వారి పేర్లను పిలిచేందుకు దౌత్యవేత్త బయటకు వచ్చిన సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొంది. ఒక వ్యక్తి బాంబును శరీరానికి ధరించి వచ్చి పేల్చుకొన్నట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు దౌత్య సిబ్బంది కూడా చనిపోగా.. మరో దౌత్యసిబ్బంది, సెక్యూరిటీ గార్డు గాయపడినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్థాన్లో దౌత్య కార్యాలయం నిర్వహిస్తున్న అతికొద్ది దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ దాడిపై తాలిబన్లు ఎటువంటి ప్రకటనా చేయలేదు. మరోవైపు దాడికి బాధ్యత తీసుకోవడానికి ఏ సంస్థా ముందుకు రాలేదు. అమెరికన్లు ఆఫ్ఘన్ గడ్డపై నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దాడులు చేస్తోంది. ఈ సంస్థ లక్ష్యాల్లో తాలిబన్లే ఎక్కువగా ఉంటున్నారు.





