
భాగ్యనగరం: ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాద్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎంఐఎం పార్టీ శ్రేణులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సామాజిక మాద్యమాల్లో రాజాసింగ్ పోస్ట్ చేసిన వీడియోను తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా రాజసింగ్పై చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యాలయం లోపలికి వెళ్ళేందుకు యత్నించటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాజాసింగ్‌పై డబీర్పురాతో పాటు పలు పోలీస్స్టేషన్లలో వరుస ఫిర్యాదులు అందాయి.
తనపై నమోదైన కేసులపై రాజాసింగ్ స్పందించారు. “రాముడిని కించపరుస్తూ షో చేసిన మునావర్ ఫారుఖీ హైదరాబాద్ వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినా షో జరిపించారు. పోలీసులకు ముందే దండం పెట్టి వేడుకున్నా వినలేదు. రాముడిని కించపరిచిన వ్యక్తికి పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారు. మునావర్ ఫారుఖ్‌కి కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పాను. అలా చేసిన వీడియోను యూట్యూబ్‌లో తొలగించారు. రెండో భాగం వీడియో త్వరలో అప్ లోడ్ చేస్తాను. యాక్షన్‌కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది. నాపై ఎలాంటి చర్యలకు దిగిన నేను రెడీ. ధర్మం కోసం నేను చావడానికైనా సిద్ధం.”
Source: EtvBharat





