
దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం గత కొద్దిరోజులుగా నిత్యం రెండువేలకు పైగానే వెలుగుచూస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే పరీక్షల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడినట్లు లోక్ నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. కొంతమందిలో అత్యంత వ్యాప్తి కలిగిన ఉపవేరియంట్ బీఏ 2.75ను గుర్తించినట్లు మెడికల్ మెడికల్ డైరెక్టర్ డా.సురేశ్ కుమార్ తెలిపారు.
ఈ వేరియంట్ యాంటీబాడీలు ఉన్నవారిలోనూ, టీకాలు తీసుకున్నవారిపైనా ప్రభావం చూపుతుందని డా.సురేశ్ పేర్కొన్నారు. ‘అనుమానంతో 90 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా.. ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ 2.75ను గుర్తించాం. టీకాలు తీసుకున్నవారిపైనా, యాంటీబాడీలు ఉన్నవారిపైనా ఈ ఉపవేరియంట్ ప్రభావం చూపుతుంది’ అని వెల్లడించారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఢిల్లీలో మంగళవారం 2,445 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత ఫిబ్రవరి నుంచి ఢిల్లీలో ఇవే అత్యధిక కేసులు. దీంతో పాజిటివిటీ రేటు 15.41శాతానికి చేరింది. వైరస్ తో ఏడుగురు మృతిచెందారు.





