News

రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలోనే…

385views

* ఆ దిశగా కేంద్రం కసరత్తు

పార్లమెంటు నూతన భవనం నిర్మాణం, సెంట్రల్ విస్టా పనులను పక్కన పెట్టాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ రెండు ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేసి, 2022 డిసెంబరులో శీతాకాల సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ కవాతును కూడా.. పూర్తిగా మెరుగులు దిద్దిన సెంట్రల్ విస్టా ప్రాంతంలో జరపాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

రెండు ప్రాజెక్టులకు టెండర్లను కరోనా ఉద్ధృతి కంటే ముందే ఖరారు చేశాం. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ దాదాపు 400 మంది కార్మికులు రెండుచోట్ల పనిచేస్తున్నారు. పెంచిన గడువులోగా మొత్తం ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సి ఉన్నందువల్ల సెంట్రల్ విస్టాలో మిగిలిన పనులను తర్వాత చేపడతాం.” అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

దురుద్దేశంతోనే కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణాన్ని అడ్డుకోవటానికి పిటిషన్లు – ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం :

దురుద్దేశంతో, ముందస్తు ప్రణాళిక ప్రకారమే కొత్త పార్లమెంట్ సెంట్రల్ విస్టా) నిర్మాణాన్ని ఆపాలని పిటిషన్లు వేశారని ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో పాటు ఢిల్లీలో మెట్రోనూ కొన్ని ఏజెన్సీలు నిర్మిస్తున్నా.. వాటి గురించి పట్టించుకోకుండా కేవలం సెంట్రల్ విస్టాను ఆపాలనే దురుద్దేశంతో పిటిషన్లు వేశారని పేర్కొంటూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

పని ప్రదేశంలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది కేంద్రం. థర్మల్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నామని వివరించింది. దీనిపై విచారణను కోర్టు మే12కు వాయిదా వేసింది.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని సోహైల్ హశ్మీ, అన్య మల్హోత్రా హైకోర్టులో పిటిషన్లు వేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.