News

కేరళ రోడ్లపై నీటి గుంతలు… స్నానం చేస్తూ వ్యక్తి వినూత్న నిరసన

402views

ర్షాల కారణంగా రోడ్డుపై నీరు నిలిస్తే.. అక్కడ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడం చూసుంటాం. లేదా అందులో నాటు వేయడం లాంటి నిరసనలు కూడా మనం చూసే ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచించాడు. రోడ్డుపై ఉన్న నీటిలోనే స్నానం చేస్తూ, బట్టలు ఉతుకుతూ, అందులోనే యోగా చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వర్షాల కారణంగా కేరళలోని మలప్పురంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. స్థానిక నేతలు పట్టించుకోకపోవడంతో హమ్జా పోరాలి అనే వ్యక్తి ఈ వినూత్న నిరసనకు దిగాడు. ఒంటిపై టవల్‌తో బకెట్‌, సబ్బు పట్టుకొని వెళ్లి.. రోడ్డుపై ఉన్నఓ భారీ నీటి గుంతలో స్నానం చేశాడు. గుబురు గెడ్డం, జుట్టుతో కనిపిస్తున్న అతడు.. ఆ నీటిలోనే పద్మాసనం, సూర్య నమస్కారాలు చేయడం గమనార్హం. ఈ వినూత్న నిరసనకు ప్రభుత్వం దిగొచ్చింది. స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్‌ నేరుగా నిరసన చేస్తున్న హమ్జా వద్దకు వెళ్లి.. త్వరలోనే మరమ్మతులు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆయన నిరసన విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ గుంతల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, చాలామంది చనిపోతున్నారని సదరు యువకుడు వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రోడ్లపై గుంతల కారణంగా కేరళ ఎర్నాకుళంలోని నెడుంబసెరీ హైవేపై జరిగిన ప్రమాదంలో కొద్దిరోజుల క్రితమే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 52ఏళ్ల ఆ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ గుంత కారణంగా రోడ్డుపై అదుపుతప్పి పడిపోగా.. అతడిపై నుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ ‌గా మారాయి.