News

ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

459views

న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుమారు 20 పేర్లను వడపోసిన అనంతరం దేశంలోని తూర్పు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందులోనూ ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీయే ద్వారా ఆ గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు విభిన్న అంశాలు, అభ్యర్థుల పేర్లపై చర్చించి చివరకు ఆమెను ఖరారు చేశారు.
ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పనిచేసిన ఈమె పేరు 2017లోనూ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. 2007 నుంచి 2012 వరకు భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌ ఉన్నారు. అధికార పార్టీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ముర్మూ అవుతారు. 1958 జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడాపోసి గ్రామంలో జన్మించిన ఈమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలివ్యక్తిగానూ రికార్డు సాధిస్తారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ముర్మూ ఒడిశాలో బీజేపీ, బిజద సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించారు. బీజేపీ నాయకత్వం పూర్తిగా సామాజిక కోణంలోనే ఆమె ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చారు.

అభ్య‌ర్థి వివ‌రాలు

పూర్తి పేరు : ద్రౌపది ముర్మూ
పుట్టిన తేదీ : 1958 జూన్‌ 20
పుట్టిన ప్రదేశం : బైదపొసి, మయూర్‌భంజ్‌ జిల్లా, ఒడిశా రాష్ట్రం
తండ్రి : బిరించి నారాయణ్‌ తుడు
భర్త : శ్యామ్‌చరణ్‌ ముర్మూ (మృతిచెందారు)
సంతానం : ఇద్దరు కుమారులు (మృతిచెందారు), ఒక కుమార్తె ఇతిశ్రీ ముర్మూ
విద్యార్హత : బీఏ (రమాదేవి మహిళా కళాశాల, భువనేశ్వర్‌)
వృత్తి జీవితం : నీటి పారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ (1979-1983). గౌరవ అసిస్టెంట్‌ టీచర్‌, శ్రీఅరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌, రాయ్‌రంగ్‌పూర్‌ (1994-1997)

రాజకీయ ప్రస్థానం..

1997: బీజేపీలో చేరిక.. రాయ్‌రంగ్‌పుర్‌ కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎన్నిక
2000: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక
2000-2002: ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రి (బిజద-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం)
2002-2004: ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రి
2004: రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక
2002-2009: మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలు
2006-2009: ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు
2010: మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు
2013-2015: మయూర్‌భంజ్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు
2015: ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియామకం

భాగస్వామ్య పక్షాలతో మాట్లాడాకే ప్రకటన

“20 పేర్లపై విస్తృత చర్చ జరిగింది. కానీ రాష్ట్రపతి అభ్యర్థి కోసం తూర్పు ప్రాంతం వారిని ఎంపిక చేయాలనీ, వీలైతే మహిళకు, ఇప్పటివరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీలకు అవకాశం దక్కనందున ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించాం. ఆ కోణాల్లో ద్రౌపదీ ముర్మూ పేరును ఖరారు చేశాం. ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించి కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే, మంత్రి, గవర్నర్‌గా ఆమె పనిచేశారు. 2007లో ఉత్తమ ఎమ్మెల్యేగా నీల్‌కంఠ్‌ అవార్డు అందుకున్నారు. విద్యను నమ్ముకొని జీవితంలో పైకెదిగారు. అప్పగించిన బాధ్యతలన్నింటినీ ఉత్తమంగా నిర్వర్తించారు. అందుకే ఎన్డీయే భాగస్వాములన్నింటితో మాట్లాడిన తర్వాత ఆమె పేరు ప్రకటిస్తున్నాం”

– జేపీ నడ్డా, బీజేపీ అధ్య‌క్షుడు

 

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి