-
చిన్నారుల్లో స్ఫూర్తి నింపటానికని వెల్లడి
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపరిచింది. 2019లో ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. ”నేను కొలనులో స్నానం చేస్తుండగా.. ఓ మొసలి పిల్లను చూశాను. దానిని ఇంటికి తీసుకుని వెళ్ళాను.
మా అమ్మ దానిని చూసి తిట్టడం వల్ల తిరిగి ఆ కొలనులోనే వదిలిపెట్టి వచ్చాను” అని చెప్పారు. ఈ సంగతిని ఉదాహరణగా చూపించిన యాజమాన్యం.. ”నరేంద్ర దామోదర్దాస్ మోదీ భారత దేశానికి 14వ, ప్రస్తుత ప్రధానమంత్రి. ఆయన చిన్నతనం నుంచే ధైర్యసాహసాలను ప్రదర్శించేవారు. బాల్యంలోనే ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకువచ్చారు” అని పుస్తకంలో ప్రచురించింది. ప్రధానమంత్రి యావత్ దేశానికి పర్యవేక్షకుడని ముద్రించింది. ప్రధాన మంత్రి చిన్నతనంలోని సాహసాలను ప్రచురించడం ఇదే తొలిసారి కాదు. గతంలో రన్నడే ప్రకాశన్ ‘బాల్ నరేంద్ర – చైల్డ్ స్టోరీస్ ఆఫ్ నరేంద్ర మోదీ’ పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు.
ఇందులో మోదీ బాల్యంలో చేసిన అనేక సాహసోపేత విషయాలను వెల్లడించారు. ఈ కథల్లో ఒకటి పాఠకులను విస్మయానికి గురిచేసింది. ”మోదీ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు కొలనులో స్నానం చేస్తుండగా ఓ మొసలి దాడి చేసింది. ఆ ప్రమాదంలో మోదీ కాలికి గాయం కాగా.. తొమ్మిది కుట్లు పడ్డాయి” అన్నది ఆ కథ సారాంశం.