
జైపూర్: ఓ సైబర్ హ్యాకర్ 13 ఏళ్ళ చిన్నారిని ట్రాప్ చేసి.. అతడి కుటుంబ సభ్యుల అందరి ఫోన్లను హ్యాక్ చేశాడు. ఈ ఘటన రాజస్తాన్ జైపుర్‌లోని హర్మడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జైపూర్‌కు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు.. మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుంటాడు. అతడికి కొంతమందితో స్నేహం ఏర్పడింది. అందులో హ్యాకర్ కూడా ఉన్నాడు.
ఈ క్రమంలో అతడికి ఒక లింక్ పంపి.. అందులో కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు పంపాలని కోరాడు. అడిగిన సమాచారం మొత్తాన్ని ఆ బాలుడు ఇచ్చేశాడు. ఓటీపీలను కూడా హ్యాకర్‌కు షేర్ చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మొబైల్‌లో హ్యాకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులకు చెందిన మూడు ఫోన్లను హ్యాక్ చేసి.. వారికి తెలియకుండా సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు, పోస్టులు పెట్టడం ప్రారంభించాడు.
బాలుడికి టాస్క్‌లు కూడా ఇచ్చేవాడు ఆ హ్యాకర్. చెప్పిన పని చేయకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలుడు తన ఇంట్లోనే స్పై చేయాల్సి వచ్చింది. హ్యాకర్ చెప్పినట్టు.. ఇంట్లోని గోడలకు, టేబుళ్ల కింద చిన్న చిన్న చిన్న డివైజ్‌లు అమర్చాడు.
ఈ పరిణామాలు బాలుడి తల్లిదండ్రులకు అనుమానాన్ని కలిగేలా చేశాయి. సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్యకర ఫొటోలు కనిపించడం.. ఇంట్లోని గోడలకు డివైజ్‌లు ఉండడం చూసి పోలీసులను ఆశ్రయించారు. సైబర్ పోలీసులు ఆ ఇంటిని పరిశీలించి, బాలుడిని ప్రశ్నించి.. అసలు విషయం తెలిసింది.
Source: EtvBharat





