
450views
విమానంలో అస్వస్థతకు గురైన ఓ ప్రయాణికుడికి కేంద్ర మంత్రి డాక్టర్ బీకే కరద్, భాజపా ఎంపీ డాక్టర్ సుభాష్ భామరె చికిత్స చేశారు.
ఈ ఘటన ఢిల్లీ – ఔరంగాబాద్ విమానంలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికుడు అస్వస్థతకు గురైన విషయం తొలుత సిబ్బందికి తెలిసింది. వెంటనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం విమానంలో ఎవరైనా వైద్యులు ఉంటే చెప్పాలని అనౌన్స్ మెంట్ చేశారు. దీంతో అదే విమానంలో ఉన్న ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్ బీకే కరద్, భాజపా ఎంపీ డాక్టర్ సుభాష్ భామరె స్పందించి సదరు వ్యక్తికి వైద్యసాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ట్విటర్‌లో పంచుకొంటూ మంత్రి, ఎంపీకి ధన్యవాదాలు తెలిపింది. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ మంత్రి, ఎంపీలు స్పందించిన తీరును అభినందించారు.





