News

సాయుధ దళాల్లో పరివర్తనాత్మక సంస్కరణలు కొనసాగుతాయ్ – భారత సైన్యాధ్యక్షుడు మనోజ్ పాండే

430views

సాయుధ దళాల్లో పరివర్తనాత్మక సంస్కరణల ప్రక్రియ కొనసాగుతోందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే తెలిపారు. సరిహద్దులు, దేశంలో అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటూనే మార్పులను చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు.

అందుకనుగుణంగానే సాయుధ దళాల ఆధునికీకరణ కొనసాగుతోందన్నారు. దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో జరిగిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ (CGP) కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కొత్త సైనిక నియామక పద్ధతి ‘అగ్నిపథ్‌’పై నిరసనలు కొనసాగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్‌, హైపర్‌సోనిక్స్ అత్యాధునిక సాంకేతికత యుద్ధ క్షేత్రాలకు చేరిందన్నారు. వీటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంస్కరణలు అనివార్యమయ్యాయని వివరించారు. సాయుధ బలగాలకు చెందిన మానవ వనరుల్లోనూ సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. భారత్‌లో భద్రతా అంశం చాలా విశాలమైందని, సంక్లిష్టమైందని, బహుముఖంగా ఉంటుందని మనోజ్‌ పాండే అన్నారు. సరిహద్దుల్లో, అంతర్గత ముప్పుల నుంచి నిత్యం సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.