
-
జమాత్- ఈ- ఇస్లామీ సంస్థకు అనుబంధంగా నడుస్తున్నందునే…
-
11 వేల మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్చాలని కేంద్రం సూచన
కశ్మీర్: జమాత్-ఇ-ఇస్లామీ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అయిన ఫలాహ్-ఇ-ఆమ్ ట్రస్ట్ (ఎఫ్.ఎ.టి) పరిధిలోని దాదాపు 300లకుపైగా స్కూళ్ళను నిషేధిస్తున్నట్టు జమ్మూ కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
ఎఫ్‌ఏటీ అనుబంధ పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బీకే సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 15 రోజుల్లోగా ఆయా పాఠశాలలకు సీల్ వేయాలని వివిధ జిల్లాలకు చెందిన విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధిత పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 11 వేల మంది విద్యార్థులను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందాలని విద్యాశాఖ సూచించింది.
ఎఫ్‌ఏటీ నిషేధిత విద్యా సంస్థల్లో కొత్త అడ్మిషన్లు చేపట్టరాదని, దీనిపై విస్తృత ప్రచారం చేపట్టాలని విద్యాధికారులను ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్ పోలీసు రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్.ఐ.ఎ) చేపట్టిన దర్యాప్తు నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. భారీ స్థాయిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, మోసాలకు పాల్పడిందనే ఆరోపణల ఎదుర్కొంటున్న ఎఫ్‌ఏటీ విద్యాసంస్థలపై ఈ మేరకు వేటుపడింది.





