ArticlesNews

వందేళ్ల ఆరవీడు వంశ పాలన

6views

శ్రీ ‌పుట్టపర్తి నారాయణాచార్యులు తన 12వ ఏట ‘‘పెనుగొండలక్ష్మి’’ అనే పుస్తకం రచించారు.‘‘దీనిని వ్రాయువేళకు నా వయస్సు పండ్రెండు సంవత్సరములు. ఆనాటికి నాకు ఛందస్సు కూడా రాదు కాని చిన్ననాటి నుండి తిక్కన భారతమును, జదువులు మాత్రమలవాటు. ఆ వాచక శక్తియే యీ రచనమునకు బునాది’’ అని ఉపోద్ఘాతములో రాసుకున్నారు పుట్టపర్తివారు.

1336-1350 ప్రాంతాలలో హరిహరరాయలు విద్యానగరాన్ని పాలిస్తున్నప్పుడు, వారి తమ్ముడు బుక్కరాయలు పెనుగొండలో రాజ ప్రతినిధిగా నివసించారట! బుక్కరాయలు విజయనగరం రాజైనప్పుడు అనంత సాగరుడు పెనుగొండ కోటను కట్టించాడు. ఇక కృష్ణదేవరాయలు వేసవి విడిదిగా పెనుగొండను తీర్చిదిద్దాడు. తళ్లికోట యుద్ధానంతరం తిరుమల రాయుడు పెనుగొండను రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు. నిజాము మూడుమార్లు దండెత్తి రాగా తిరుమలరాయుడు మూడుమార్లూ అతనిని తరిమికొట్టాడట.

పెనుగొండ కోట నిర్మాణంలో వాడిన శిలల గురించి ‘‘ఎట్లు పైకెత్తిరో యేనుగున్నలకైన తల దిమ్ముగొలుపు నీ శిలల బరువు’’ అనే పద్యంలో ఏనుగులకు సైతం తల దిమ్మెక్కే బలమైన శిలలు ఎలా ఎత్తారో ఆనాడు అంటారు నారాయణాచార్యులు.

బంగారు పల్లకీలలో కవులను కూర్చోబెట్టి పండితులు వారిని కీర్తిస్తూ ఉండగా, సార్వభౌముడు తాను సైతం మోసుకొని వచ్చిన దృశ్యం పుట్టపర్తి వారికి గుర్తువచ్చింది.

ఈ కావ్యమంతా గత వైభవ ఘనకీర్తిని గానం చేస్తూ – దాన్ని పునరుజ్జీవింప చేయగలిగే శక్తి యుక్తులను సహజంగా అలవర్చుకోవాలన్న సందేశం వినిపిస్తుంది. పుట్టపర్తి వారి మనసులో గుబాళించిన మల్లెల సౌరభం పెనుగొండ ఉద్యానవనాల్లోనిదే. ఘనగిరిగా ప్రసిద్ధమైన పెనుగొండరాయల కాలంలో దానిమ్మ తోటలకు, ద్రాక్ష తోటలకు లవంగ లతికలకూ ఆకారంగా ఉండేదట! పెనుగొండలో విహరించి అక్కడ మల్లెపూల గుబాళింపులకు పులకించి, ద్రాక్ష తోటల సోయగాలకు సొలసి, అల్లసాని పెద్దన హిమాలయ సానుసీమల ప్రకృతి సౌందర్యాన్ని అంత హృద్యంగా రూపు కట్టించాడనీ, భట్టుమూర్తి వసుచరిత్ర నేపధ్యమంతా ఘనగిరి ఘనతేనని పుట్టపర్తివారి ప్రగాఢ విశ్వాసం.

పెనుగొండ లక్ష్మి గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి. తన 12వ ఏట రాసిన ఈ పుస్తకమే తన 37వ ఏట విద్వాన్‌ ‌పరీక్షకు పాఠ్యగ్రంధం కాగా ఆ పరీక్షల్లో పుట్టపర్తివారు ఫెయిల్‌ అయ్యారట. కారణం ఒక్క ప్రశ్నకు 40 పేజీల ఆన్సర్‌ ‌రాసేటప్పటికి సమయం దాటిపోయిందట ప్రపంచంలో ఏ కవికీ ఇటువంటి పరిస్థితి రాలేదు.

‘‘ఇది యాంధ్ర వీరాగ్ని యినుమడింపగ’’ పద్యంలో పెనుగొండ కోటను చూస్తూ అక్కడ శత్రు రాజుల హృదయములను అల్లకల్లోల మొనరించిన ఆంధ్ర వీరాగ్ని శౌర్యాన్ని – ఆ పదకొండేళ్ల  బాల నారాయణ వివరించాడు.

తళ్లికోట యుద్ధం విజయనగర సామ్రాజ్య చరిత్రను మలుపు తిప్పిన అత్యంత కీలకమైన, విషాదకరమైన ఘట్టం. ఈ యుద్ధం సా.శ.1565 జనవరి 23న ప్రస్తుత కర్ణాటకలోని కృష్ణా నదీ తీరాన గల రాక్షసి-తంగడి గ్రామాల మధ్య జరిగింది.

ఈ యుద్ధం విజయనగర సైన్యానికీ (ప్రధానమంత్రి అళియ రామరాయలు అతని సోదరులు తిరుమల దేవరాయలు, వేంకటాద్రి నేతృత్వంలో), దక్కన్‌ ‌సుల్తానుల కూటమికి (బీజపూర్‌, ‌గోల్కొండ, అహమ్మద్‌నగర్‌, ‌బీదర్‌ ‌సుల్తానులు) మధ్య జరిగింది. విజయనగరం మొదట పైచేయి సాధించినప్పటికీ• రామరాయల సైన్యంలోని ఇద్దరు ముస్లిం సేనాపతులైన గిలానీ సోదరులు చివరి నిమిషంలో ద్రోహంచేసి సుల్తానుల వైపు చేరారు. దీనితో 80 ఏళ్ల వృద్ధుడైన రామరాయలు అహమ్మద్‌గనర్‌ ‌సుల్తాన్‌ ‌నిజాంషాకు చిక్కాడు. యుద్ధభూమిలోనే రామరాయల శిరచ్ఛేదం చేశాడు, వేంకటాద్రి అదృశ్యమయ్యాడు. తిరుమల దేవరాయలు మిగిలిన సైన్యాన్ని రాజవంశీయులను, సామ్రాజ్య ఖజానాను ఏనుగులపై తీసుకుని హంపీ నుండి పెనుగొండకు సురక్షితంగా తరలిపోయాడు. హంపీ నగరాన్ని నెలల తరబడి లూటీ చేశారు ముష్కరులు.

పెనుగొండ చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు ఉండటం వలన శత్రువుల దాడులకు అంత సులభంగా చిక్కని సహజరక్షణ కలిగి వుంది. దీనికి తోడు ఆ నగరం చుట్టూ భారీ రాతి గోడను, బురుజులను నిర్మించారు. లోపల గగన్‌ ‌మహల్‌ అనే అందమైన రాజ ప్రాసాదాన్ని నిర్మించారు. తళ్లికోట యుద్ధంలో నష్టపోయిన సైన్యాన్ని పెనుగొండ కోట కేంద్రంగా తిరుమల దేవరాయలు పునర్‌నిర్మించాడు. ఇది ఆరవీడు రాజ్యాన్ని మరో శతాబ్దకాలం పాలించడానికి పునాది వేసింది.

రెవరెండు హెన్రీ హేరాస్‌ ‌రాసిన ప్రసిద్ధ చారిత్రక గ్రంధం ‘‘ది ఆరవీడు డైనాస్టీ ఆఫ్‌ ‌విజయనగర’’. ఇది విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన నాల్గవ, చివరి హిందూ రాజవంశమైన ఆరవీడు వంశ సమగ్ర చరిత్ర. దీనికి తోడు విలాపాక్కిం తామ్ర శాసనం విజయనగర సామ్రాజ్య చరిత్రకు, ముఖ్యంగా ఆరవీటి వంశరాజుల కాలానికి సంబంధించిన కీలకమైన చారిత్రక ఆధారం. అలాగే కల్లూరు దాన శాసనాన్ని 2వ వేంకటపతి దేవరాయలు వేశాడు. వీటి ఆధారాలతో ఈ క్రింది విషయాన్ని వివరిస్తున్నాం.

తళ్లికోట యుద్ధం ముగిసిన కొద్దిరోజులకే (సా.శ.1568-1570 ప్రాంతంలో) విజయనగర సామ్రాజ్యం ఇంకా కోలుకోలేదనే బలహీనతను ఆసరాగా చేసుకొని బీజాపూర్‌ ‌సుల్తాన్‌ ఆలీ ఆదిల్‌షా తన అత్యంత శక్తిమంతమైన ఫిరంగిదళం, వేల కాల్బలం, అశ్విక దళాలతో వచ్చి పెనుగొండ కోటను చుట్టుముట్టాడు. కోటలోనికి ఆహారం, నీళ్లను నిలిపివేశాడు. ఇక గత్యంతరం లేక గోవిందరాజు తిమ్మ (మంత్రి), పాపయ్యశెట్టి (సైన్యాధ్యక్షుడు) ఆలీ ఆదిల్‌షా వద్దకు రాయబారిగా వెళ్లారు. ఈ రాయబారం కుదిరింది. మొదటి అంశం పెనుగొండ కోట చుట్టూ ఆదిల్‌షా సైన్యంను ఉపసంహరించు కోవడం, అలా చేశాక 30,000మంది మస్కిటీర్స్‌ను (తుపాకీ సైన్యం), ఆహారం, నీరు నిల్వచేశారు. కోట లోపల ఎటువంటి కరువు రాకుండా అన్ని వస్తువులు సమకూర్చుకొని, తన సామంతులైన తంజావూరు పాలకుడు అచ్యుతప్ప, అతని తన 2వ కుమారుడు రఘునాథనాయకుని అప్రమత్తం చేశాడని రఘునాదాభ్యుదయంలో వ్రాశారు. సైన్యాధ్యక్షులైన జగ్గదేవ, కుల్రాజుశెట్టి, పాపయ్యశెట్టి మట్ల అనంతరాజు, మలుప రాజులను తమ సైన్యంతో సిద్ధం చేశాడు. వీరు వ్యక్తులు మోసే ఫి•రంగులను సిద్ధం చేశారు.

సుల్తాన్‌ ఆదిల్‌షా పెన్నానది ఒడ్డున తన ఫిరంగి దళాన్ని ఉంచాడు. ఇవి స్థిరంగా ఉంటూ కదల్చడానికి వీలుకాదు. ఫిరంగులును నిరంతరాయంగా పేల్చడానికి లేదు. కారణం అవి వేడెక్కుతాయి, లోపలి భాగం పాడవుతుంది కాబట్టి అవి చల్లారడానికి కొంత సమయం ఇవ్వాలి. ఫిరంగులు పేలుతున్న సమయంలో చాకచక్యంగా తప్పించుకొని, అవి చల్లారడానికి సమయం ఇవ్వగానే ఆలీ ఫిరంగిదళాన్ని కకావికలు చేశారు.

ఇలా యుద్ధం జరుగుతూ ఉండగా వర్షాకాలం వచ్చి పెన్నానది పొంగటం ప్రారంభించింది. ఈలోగా కులీకి శత్రువైన అహమ్మద్‌నగర్‌ ‌నిజాంషాతో దౌత్యం చేసి, ఇక్కడ యుద్ధం జరిగే సమయంలో బీజపూర్‌పై నుండి చేసేటట్టు ఏర్పాటుచేశాడు. దానితో బీజాపూర్‌ ‌సైన్యం వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. పెన్నానది ఉధృతికి సైన్యం నదిని దాటడం కష్టమయ్యింది. వర్షాల వల్ల బురదలో ఫి•రంగులను తిరిగి తీసుకువెళ్లడం కష్టమయ్యింది. వాటిని బండ్లపై తీసుకు వెళ్లాలి బండి బురదలో కూరుకుపోయేది. చావు తప్పి కన్నులొట్టపోయి ఆలీ మాత్రం బీజాపూర్‌ ‌చేరాడు.

తన సొంత రాధాని ప్రమాదంలో పడిందని తెలుసుకున్న బీజాపూర్‌ ‌సుల్తాన్‌ ఆలీ ఆదిల్‌షా పెనుగొండ ముట్టడిని అర్ధాంతరంగా విరమించుకుని తన సైన్యంతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ విధంగా తిరుమలరాయలు శత్రువుల అంతర్గత విభేదాలను వాడుకొని పెనుగొండకోటను, విజయనగర సామ్రాజ్యాన్ని ముస్లింల వశం కాకుండా కాపాడగలిగారు. దీనినే చరిత్రలో పెన్నా యుద్ధంగా పిలిచారు. ఈ విజయంతో ఆయన అధికారం బాగా బలపడింది. సా.శ.1570లో అధికారికంగా చక్రవర్తి పట్టాభిషేకం చేసుకున్నారు. అయిన విదేశీ చరిత్రకారులు ఈ సంఘటనకు ప్రాధాన్యత ఇవ్వలేదు.

‘‘అన్నాతి గూడ హరుడవు

అన్నాతి గూడకున్న నసుర గురుండౌ

అన్నా తిరుమల రాయా

కన్నొక్కటి లేదు గాని కాంతుడుగావే’’

తిరుమలరాయ నీవు నీ భార్యతో కూడి ఉంటే మూడు కన్నుల శివుడవు. నీది ఒక కన్ను + ఆమెవి రెండు కళ్లు = 3 కన్నులు గల హరుడవు. ఆమెతో కూడకుండా ఉంటే నీవు రాక్షస గురువైన శుక్రాచార్యుడవు (ఆయనకు ఒక కన్నే కలదు). నీకు ఒక కన్ను లేకపోయినా నీవు మన్మధుడవే అని రామరాజ భూషణుడు అన్నట్లు  కొందరు పండితులు చెప్పగా, దీన్ని తెనాలి రామకృష్ణ చెప్పాడని మరికొందరు పండితులు తెలియజేస్తున్నారు.

ఈ చాటు పద్యాన్ని బట్టి తిరుమల రాయలకు ఒక కన్ను మాత్రమే వుందని తెలుస్తోంది. తళ్లికోట యుద్ధంలో సుమారుగా విజయనగర వీరులందరూ మరణించారు. ఒక తిరుమలరాయలు తప్ప, యుద్ధ ప్రారంభంలోనే ఈయన కన్నుకు ఈటె గుచ్చుకొని గాయం కాగా యుద్ధ భూమి నుండి వెనుదిరిగాడు కాబట్టి ఈయన బ్రతికాడు. అంతేకాదు ఆరవీడు రాజవంశం మరో శతాబ్దంపాటు పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలించారు.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు