News

గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో

3views

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అధికారులు వివరించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

ఈ సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో భక్తి భావాన్ని మరింత పెంపొందించేలా ఎస్వీబీసీ కార్యక్రమాలు ఉన్నత ప్రమాణాలతో, సృజనాత్మకంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తిరుమల క్షేత్రంలోని మండపాలు, తీర్థాలు, ఉపాలయాలు, శ్రీవారి ప్రసాదాల విశిష్టతను భక్తులకు సులభంగా అర్థమయ్యే రీతిలో అందించాలని సూచించారు.

ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతి భక్తుడి హృదయానికి చేరేలా ఆకర్షణీయమైన కార్యక్రమాలు రూపొందించాలని, లక్షలాది మంది వీక్షించే ఎస్వీబీసీ ప్రసారాల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తి, భావం, సరళత కలగలిపిన వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకాదరణను మరింత పెంచాలని దిశానిర్దేశం చేశారు.

అనంతరం ఎస్వీబీసీ సీఈవో, టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ, హెచ్‌డీపీపీ సహకారంతో ప్రారంభించిన ‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమాన్ని త్వరలో గ్రామస్థాయికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని ప్రముఖ కళాకారులతో ప్రత్యేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

సమీక్షకు ముందు ఈవో ఎస్వీబీసీలోని స్టూడియోలు, ఎడిటింగ్ విభాగాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించిన ఆయన, అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.