ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ భీరవరసు శ్రీరామ్ శరణ్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (IAU) సౌర కుటుంబంలోని ‘1999 EX169’ గ్రహశకలానికి ఆయన పేరును అధికారికంగా ఖరారు చేసింది. సౌర కుటుంబంలోని గ్రహాలు, ఉపగ్రహాలపై ఆయన చేసిన విశిష్ట పరిశోధనలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటకు చెందిన డాక్టర్ శ్రీరామ్ శరణ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో ప్లానెటరీ రాడార్ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంగారకుడు–గురుడు గ్రహాల మధ్య ఉన్న ప్రధాన గ్రహశకల వలయంలో పరిభ్రమిస్తున్న ‘1999 EX169’ గ్రహశకలానికి ఆయన పేరును అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య నామకరణం చేసింది.
ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2 మిషన్‌లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ (DFSAR) ద్వారా చంద్రుడి ఉపరితలంపై నిర్వహించిన పరిశోధనల్లో డాక్టర్ శ్రీరామ్ శరణ్ కీలక పాత్ర పోషించారు. అలాగే శుక్రగ్రహంపై ఆయన చేసిన పరిశోధనలు ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ‘నేచర్ ఆస్ట్రోనమీ’లో ఇటీవల ప్రచురితమై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి.
అంతరిక్ష పరిశోధనల్లో తెలుగు శాస్త్రవేత్త ప్రతిభకు దక్కిన ఈ అరుదైన గౌరవం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలిచింది.





