News

సామాన్యులకు మరింత సుళువుగా శ్రీవారి దర్శనం చేయిస్తాం – టీటీడీ ఈవో ధర్మారెడ్డి

473views

గంటల కొద్దీ నిరీక్షణ లేకుండా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు.

సామాన్య భక్తులకు సర్వదర్శనం గంటన్నర వ్యవధిలోనే చేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 దర్శనంతోపాటు వివిధ సేవలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. బుధవారం ఆయన ‘ఈనాడు- ఈటీవీ’తో పలు అంశాలపై మాట్లాడారు. ”ఏప్రిల్‌ 12 వరకు టైమ్ ‌స్లాట్‌ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేవారు.

క్యూలైన్లలో తోపులాట లేకుండా నేరుగా క్యూ కాంప్లెక్స్ ‌లోకి వెళ్లి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశాం. తిరుపతిలోని శ్రీభూదేవి కాంప్లెక్స్ ‌తోపాటు విష్ణునివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో టైమ్ స్లాట్‌ టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రద్దీకి అనుగుణంగా సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టాం. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్‌ మినహా వీఐపీ బ్రేక్‌ దర్శనం సిఫార్సు లేఖలను తీసుకోవట్లేదు.

శ్రీవాణి ట్రస్టుకు వచ్చిన నిధులతో 150 కొత్త ఆలయాలను నిర్మించనున్నాం. దాదాపు 100 పురాతన ఆలయాలకు నిధులు కేటాయించాం. మరో 500 గుడుల పునరుద్ధరణకు నిర్ణయించాం. గత రెండున్నరేళ్ల కాలంలో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నాం.

216 బైండోవర్‌ కేసులు పెట్టి, 1377 మందిని తిరుమల కొండకు రాకుండా నిరోధించగలిగాం. దీనివల్ల ఏడాదికి దళారుల చేతుల్లోకి వెళ్లే సుమారు రూ.215 కోట్లు శ్రీవాణి ట్రస్టు ద్వారా స్వామికి చేరుతున్నాయి. తిరుమలలో ఉన్న 7,500 గదులకు 40 ఏళ్లుగా మరమ్మతులు చేయలేదు.

కొవిడ్‌ సమయంలో ఈ పనులు చేపట్టాం. 4,500 గదుల మరమ్మతులు పూర్తి చేశాం. 750 గదుల పనులు నడుస్తున్నాయి. సెప్టెంబరు నాటికి అన్నింటి మరమ్మతులు పూర్తి చేస్తాం.

తిరుమల కాంక్రీట్‌ అరణ్యంలా మారకూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్తగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టడం లేదు. రెండున్నరేళ్లలో రూ.1500 కోట్ల విరాళాలను తీసుకురాగలిగాం. దీనివల్ల హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర పనులకు ఉపయోగించకుండా బ్యాంకుల్లో జమ చేసేందుకు అవకాశం కలిగింది” అని ధర్మారెడ్డి వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.