News

ఉత్తరప్రదేశ్‌లో మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్ట్ ల్లేవ్‌!

416views

ల‌క్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మహిళల భద్రత కోసం మహిళా ఉద్యోగులకు నైట్​ షిప్ట్​లు వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయవద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను కోరింది.

ఈ క్రమంలోనే ఒకవేళ సాయంత్రం ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు పని చేసే మహిళా ఉద్యోగులకు ఆఫీసు యాజమాన్యం ఉచిత రవాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కంపెనీలు, ఆఫీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది.

అంతేకాకుండా, ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు. అవసరమైన సేవలు మినహా అన్ని విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలలో ఈ నిబంధనలు వర్తిస్తాయని సమాచార ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ తెలిపారు.

అలాగే, ఆఫీసుల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, మంచినీటి సౌకర్యాలతో పాటు పనిచేసే ప్రదేశంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, వారు తమ కుటుంబానికి తగినంత సమయం కేటాయించాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి