
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత‍్తర్వులు గురువారం జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి తెలిపారు. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని అన్నారు.
అలాగే బుధవారం కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదేశాలు అమలు చేయడం లేదన్న కారణంతో ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకుల్ గోయల్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. డిపార్ట్‌మెంటల్ పనులపై ఆసక్తి చూపకపోవడం, ప్రభుత్వ పనులను పట్టించుకోకపోవడం వల్లే డీజీపీ పదవి నుంచి రిలీవ్ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముకుల్ గోయెల్‌ను సివిల్ డిఫెన్స్ డీజీ పోస్టుకు పంపినట్లు సమాచారం. అదనపు డైరెక్టర్ జనరల్, లా అండ్ ఆర్డర్, ప్రశాంత్ కుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.
Source: NationalistHub





