
విజయవాడ: శరీరంలోని రకరకాల అవయవాలు మొత్తం శరీరం కొరకు పనిచేస్తాయి. ప్రతి అవయవం ఆరోగ్యం, సమగ్రతల ప్రభావం శరీరమంతటిపై పడుతుంది. అదే విధంగా సమాజంలోని ఏ వర్గమూ బలహీనంగా ఉండరాదు.. అందరు ఒకరికొకరు తోడుగా ఉండాలనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) స్థాపకులు డాక్టర్జీ ఆలోచన. సరిగ్గా ఆ ఆలోచననే తమకు అన్వయించుకుని ముందుకు సాగుతోంది… పట్టణంలోని మాధవ సంస్కృతి మండలి.


ఇందులో భాగంగా, వేసవి కాలంలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు కొంత మొత్తం వ్యయం చేసి, గవర్నర్ పేటలోని మాధవ సదన్ వద్ద గురువారం చలివేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని మండలి అధ్యక్షుడు పి.వెంకటేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షుడు ఏవీఎస్ నాగార్జున రాజు, కార్యదర్శి బి.పవన్ కుమార్, ఆర్.ఎస్.ఎస్ మహా నగర్ కార్యవాహ పి.సూర్యనారాయణ మూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బాటసారులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని, వడదెబ్బకు గురికాకుండా ఉండాలన్నారు.
కాగా, వేసవి కాలమంతా ఈ చలివేంద్రం వద్ద మాధవ సదన్‌లోని విద్యార్థులు సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్. విభాగ్ ప్రచారక్ డి.నవీన్, ఘోష్ ప్రముఖ్ ప్రసన్న కేసవ, తదితరులు పాల్గొన్నారు.





