News

కొంప‌లు ముంచుతున్న‌ చైనా రుణయాప్‌లు!

497views

న్యూఢిల్లీ: రుణ యాప్‌లను నిర్వహిస్తున్న చైనీయులు ఈసారి పోలీసులకు దొరక్కుండా రెండు పొరుగు దేశాలకు మకాం మార్చేశారు. అక్కడ నుంచే గతంలో రుణాలు తీసుకున్నవారి వివరాలను సేకరించారు. ఇలా 4.5 లక్షల మంది వివరాలు తీసుకుని మా యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోండి అంటూ రోజూ ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు.

అప్పు తీసుకుని చెల్లించిన వారికి మాత్రం వాట్సాప్‌ సందేశాలు పంపుతున్నారు. వాటికి స్పందించిన వారికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు నగదు బదిలీ చేస్తున్నారు. స్పందించని వారికి కూడా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వారి అంగీకారం లేకుండానే వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందుకోసం ఒక కార్పొరేట్‌ బ్యాంక్‌లో వర్చువల్‌ ఖాతాలను తెరిచారని, రెండు నెలల్లో వీరు కనీసం 75 వేల మందికైనా రుణాలిచ్చుంటారని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు.

యాప్‌ల నిర్వహణ, నగదు బదిలీ కోసం చైనీయులు ఎంచుకున్న పంథాపై కీలక ఆధారాలు లభించాయి. 3 నెలల క్రితం ఆ రెండు దేశాలకు చైనీయులు వెళ్ళినట్టు సాంకేతిక ఆధారాలు లభించగా మరిన్ని సాక్ష్యాల కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ లభిస్తే ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీచేయాలని నిర్ణయించారు.

మూడురోజులకే వేధింపులు షురూ.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని ముషీరాబాద్‌లో ఉంటున్న నర్సింగ్‌ విద్యార్థిని ఖాతాలో కొద్దిరోజుల క్రితం రుణయాప్‌ సంస్థలు రూ.50 వేలు నగదు బదిలీ చేశాయి. అవసరం లేకుండానే డబ్బు పంపారని, తిరిగి ఎలా పంపాలా అని అనుకుంటుండగా.. మూడోరోజు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి.. అసలు, వడ్డీ రూ.80 వేలు వారంరోజుల్లోపు చెల్లించాలని గట్టిగా హెచ్చరించారు. తనకు సంబంధం లేదని చెప్పగా ఆమె ఫోటోలు నగ్నంగా మార్చి స్నేహితులకు పంపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి