
ఢిల్లీ: ఢిల్లీలోని గాజీపుర్ ప్రాంతంలో బీజేపీ నేత హత్యకు గురయ్యారు. మృతుడు మయూర్ విహార్ జిల్లా యూనిట్‌కు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను జీతూ చౌదరీగా పోలీసులు గుర్తించారు.
ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పోలీసుల వివరాలు ప్రకారం.. మయుర్ విహార్ ప్రాంతంలో నివసించే జీతూ చౌదరీ బుధవారం రాత్రి తన ఇంటి బయటకు వచ్చి నిల్చున్నాడు. అదే సమయంలో బైక్‌పై ఇద్దరు దుండగులు వచ్చి జీతూపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.
ఈ క్రమంలో తల, కడుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటన రాత్రి సుమారు 8.15 గంటలకు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పులకు గురైన జీతూను అక్కడి స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.





