News

శ్రీ‌శైలంలో అర్ధ‌రాత్రి ఉద్రిక్త‌త‌!

623views
  • క‌న్న‌డ భ‌క్తులు, టీ దుకాణదారుని మ‌ధ్య గొడ‌వ‌

శ్రీ‌శైలం: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో గత అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల నేప‌థ్యంలో ఆలయ అధికారులకు, స్థానికులకు మధ్య గొడవలు మొదలయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు భ్రమరాంబిక అమ్మవారికి చీరలు, ఇతర నైవేద్యాలను తీసుకుని వచ్చారు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా రెండేళ్ళ‌ తర్వాత ఈ సంవత్సరం పొరుగు రాష్ట్రాల నుండి ఎక్కువ మంది భక్తులు దర్శనం కోసం వచ్చారు.

ఓ టీ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. అక్కడ మాటా మాటా పెరగడంతో దుకాణాన్ని కన్నడ భక్తులు ధ్వంసం చేశారు. దీంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇక ఈ విషయం తెలిసి మరికొందరు రెచ్చిపోయారు. తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై దాడులు జరిపారు. ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. ఆలయ పరిసరాల్లోని దుకాణాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లతో పాటు, తాత్కాలిక షాపులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి