ArticlesNews

కాశ్మీరీ హిందువులను క్షమాపణ వేడుదాం…

600views

ర్థరాత్రి అంధకారం. కాశ్మీర్ లోయలోని మసీదుల మైకుల నుంచి ‘అల్లాహో’ ఆక్బర్’ ఆశ్చర్యం. అంతేకాదు అక్కడి హిందూ -వండిట్లనుద్దేశించి కాఫిరో… కాశ్మీర్ చోడ్ దో… ఔరతోంకా సాథ్ ( ఆడవారిని మాకు వదిలేసి వెళ్లిపోండి.. పారిపోండి) అన్న రంకెలు వినిపించాయి. గొంతుల్లో కర్మశత్వం, కాఠిన్యం, రాక్షసత్వం పచ్చిగా ధ్వనించింది. అనంతరం ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఊచకోతకు పాల్పడ్డారు. విధ్వంసానికి తెగబడ్డారు. అత్యాచారాలకు పూనుకున్నారు. వీధుల్లో కూడళ్లల్లో తూపాకులు పేలాయి. విశృంఖలత్వం స్వైరవిహారం చేసింది. ఉన్మాదం హద్దులు చెరిపేసుకుంది. హిందువులపై ఉగ్రవాద పిడుగుపడింది. అంతే మానవత్వం, మంచితనం పాతాళానికి వెళ్ళిపోయింది. ఇదంతా సరిగ్గా 30ఏళ్ల క్రితం కాశ్మీర్లో చోటుచేసుకుంది. ఆ కాళరాత్రి చలిపులి కబళిస్తున్నవేళ, కర్కశుల భయానక ఆరువులు, కేకలు, తుపాకుల చప్పుళ్ల మధ్య అత్యున్నత శిఖరాలను చేరిన ఓ నాగరిక సంస్కృతి, సభ్యత… వలస, మహావలస బాట పట్టింది. చలికి శరీరాలేకాదు, ఆలోచనలు సైతం గడ్డకట్టగా, కన్నీళ్లు సైతం కరవై అందిన ట్రక్కులు, ట్యాక్సీలలో కాశ్మీరుకు వీడ్కోలు ప్రారంభమైంది. ఆ తరువాత అనేక రాత్రులు, పగళ్లు ఇదే దృశ్యం లోయలో పునరావృతమైంది. అలా లక్షల సంఖ్యలో పిల్లాపాపలతో, వృద్ధులతో నరకయాతన అనుభవిస్తూ ఆస్తులను వదిలేసి, విలువైన వస్తువుల్ని వదిలేసి కట్టుబట్టలతో కాశ్మీరీ హిందువులు వలసబాట పట్టారు.

కొందరికి ఇదేదో ఒక కాల్పనిక గాథలా అనిపించవచ్చు. కానీ ఇది పరమ వాస్తవం, సత్యం. కేవలం మూడు దశాబ్దాల క్రితం స్వర్గం లాంటి కాశ్మీర్ లోయలోని హృదయ విదారక చరిత్ర ఇది. మానవత్వం, మంచితనం, విలువలు, సభ్యత, సంస్కృతి, సంస్కారం ఎంతో ఎత్తుకు ఎదిగాయని భావించిన సందర్భంలోనే ఈ బార్చరికత, బందూకులమోత, రాక్షసక్రీడ యదేచ్చగా రోజులు, నెలలు సంవత్సరాల తరబడి కొనసాగింది. సొంత దేశంలో కాశ్మీరీ హిందువులు లక్షలాది మంది శరణార్థులుగా, దీనంగా, హీనంగా, ప్రాథమిక సౌకర్యాలు లేని చోట కాలం గడిపారు. అనేక మంది చలికి, పాములు ఇతర విషప్రాణుల బారినపడి, మానసికంగా కుంగిపోయి కన్నుమూశారు. లోయలో ఆనాడు ‘మిలావో.. మరావో… దాగిజావో మాటలు మైకుల్లో ప్రతిధ్వనించాయి. అంటే ఇస్లాంలో కలవండి. లేదా చచ్చిపోండి… పారిపోండి. అది హుకుం అక్కడి అనేక పురాతన ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువుల ఇళ్లను పేల్చివేశారు. హిందువుల చిహ్నమేదీ కానరాకుండా శపథం చేసి పథకం ప్రకారం కార్యాచరణకు వూనుకున్నారు. గ్రామాల పాత పేర్లను మార్చి ఇస్లామిక్ పేర్లు పెట్టారు. కాశ్మీర్ ఇకపై పాకిస్థాన్ అంటూ పాక్ జెండాలతో ఊరేగింపులు జరిపారు. ఎవరైనా మిగిలిపోయిన హిందూ మహిళలు కనిపిస్తే అత్యాచారం చేశారు. ఇస్లాంలోకి బలవంతంగా మార్చారు. అనేక చోట్ల గ్యాంగ్ రేప్ లకు పాల్పడ్డారు. ఐదువేల సంవత్స రాల హిందువుల పరుపు- ప్రతిష్ట గౌరవం, అంతా క్రూరమైన నినాదాల మధ్య భూస్థాపితం చేశారు. – భారత కు ఎవరు అనుకూలమని పసిగట్టినా వారికి ‘సమాధి’ కట్టారు. వారిలో మేథావులున్నారు. విద్యాధికులున్నారు. అడ్వకేట్లున్నారు. ఇంజినీర్లున్నారు. పత్రికా సంపాదకులూ ఉన్నారు. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల దాష్టీకానికి వారందరూ బలయ్యారు. వేలమంది నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోయారు. తుపాకి ముందు, పశుబలం ముందు, రాక్షసత్వం ముందు ఓ సుందర సాహిత్య – సాంస్కృతిక సౌధం కుప్పకూలింది.

తరతరాల సంస్కృతి- ఆధారాలు అన్నీ కాలి బూడిదయ్యాయి. ఆరాధనా స్థలాలు, మందిరాలు, ప్రార్ధనా వేదికలు నేలకొరిగాయి, వాటిని అపవిత్రం చేశారు. తరతరాలుగా సాత్వికతతో సారస్వత బ్రాహ్మ ణులుగా పేరొందిన, అతి ప్రాచీన సరస్వతీ నది ఒడ్డున సభ్యతను ఉన్నత శిఖరాలకు చేర్చిన పండిట్లు సాయుధ మూకల చేతిలో ఘోరంగా, అత్యంత ఘోరంగా అవమానాల పాలయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. కొందరు పండిట్ల శరీరాలను ముక్కలుగా నరికి చెల్లాచెదురుగా విసిరేశారు. కొందరి కనుగుడ్లను పైకిలించి వికృతంగా మార్చి నడిరోడ్డుపై నిల్చోబెట్టారు ఇస్లామిక్ జీహాదీలు. ఈ ఊచకోత, మూకుమ్మడి హత్యాకాండ, బార్బరికత, జెనోసైడ్, నరమేధం, నిర్నిరోధంగా కొనసాగింది. హిందువుల అస్తిత్వాన్ని సంపూర్ణంగా తుడిచేయాలని పన్నిన కుట్ర – దాడులవి. ఆ దాష్టీకానికి గురైన వారు కొందరు ఇంకా ఢిల్లీ, జమ్మూ శరణార్ధి శిబిరాల్లో కనిపిస్తారు. ఈ ఆటవిక, ఆకృత్యాలు దశాబ్దాలపాటు కొనసాగడం సిగ్గుచేటు. ఇంత బరితెగింపును పాలకులు చూసీచూడనట్టు వదిలేయటం దారుణాతి దారుణం. 20వ శతాబ్దం ఆఖరులో… ఒక జాతి నిర్మూలనకు పాల్పడిన వారిని నిలువరించకపోవడం అతిపెద్ద విషాదం. ఇస్లామైజేషన్ పేర కొనసాగిన ఈ దారుణస్థితిని ముందుగా పసిగట్టి నివారించని పాలకుల నిర్వీర్య విధానాలను చరిత్ర ఎప్పటికీ క్షమించదు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకుని అసంబద్ధమైన ఆజాద్ కాశ్మీర్ పేర స్వార్థ రాజకీయ నాయకులు, జీహాదీలు, పాక్ అనుకూల మత ఛాందస మూకలు దశాబ్దాలపాటు ఆటవిక పద్ధతిలో సాగించిన రాక్షస క్రీడ అత్యంత దుర్మార్గం, మాటలకందని దారుణం. దశాబ్దాలుగా ఈ మాయని మచ్చపై కనిపించవలసినంత స్పందన కనిపించకపోవడం వుండుమీద ‘కారం’ చల్లడమే అయింది. నిర్భయ కేసులో దేశమంతా అట్టుడికింది. అలాంటివి కాశ్మీర్ గడ్డపై కోకొల్లలు జరిగాయి. మానవ హననం జరిగింది. కానీ ఇంతవరకు కనీసం విచారణ లేదు. ఏ ఒక్కరూ కోర్టుబోనులో కాలుపెట్టలేదు. ఇదీ కాశ్మీర్ దుస్థితి. అందుకు దేశం మొత్తం సిగ్గుపడాలి. కనీసం ఆ దుర్మార్గ చర్యలకు ముప్ఫైఏళ్లు నిండిన సందర్భంగానైనా మనమందరం కాశ్మీరీలను ‘క్షమాపణలు’ కోరాలి.

– వార్త సౌజన్యంతో…

– ఉప్పల నరసింహం,
9985781799.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.