News

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

521views

తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.

ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.