
భారత్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి దేశవ్యాప్తంగా 12-14 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నారు. ఈ తరుణంలో అర్హులైన వారంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇదొక ముఖ్యమైన రోజని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. 2008, 2009, 2010 సంవత్సరాలలో పుట్టిన పిల్లలకు కార్బివ్యాక్స్ టీకా వేస్తున్నారు.
టీకాయే శ్రీరామ రక్ష – వైద్య నిపుణులు
టీకాయే కరోనా నుంచి రక్షించే సంజీవని అని, కనుక దేశంలోని ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని నిపుణులు విన్నవిస్తున్నారు. ప్రపంచంలో అగ్రదేశాలుగా చలామణి అవుతున్న దేశాలు సైతం కరోనా కల్లోలంతో గజ గజ వణికిపోయినా, కేవలం మన శాస్త్రవేత్తలు సకాలంలో సత్వరమే అందించిన కోవిడ్ వ్యాక్సిన్ కారణంగానే మనం వీలైనంత సురక్షితంగా ఉండగలుగుతున్నామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.





