
పాల్ఘర్: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో రూ.5 కోట్లు విలువైన హెరాయిన్ దొరికింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులు మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది.
వసయీ ప్రాంతంలోని పెల్హార్ గ్రామంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఏటీఎస్ అధికారులు.. తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 1.724 కిలోల హెరాయిన్ పట్టుబడింది. దీంతో పాటు రూ.2,60,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు.
షూ రవాణా ముసుగులో డ్రగ్స్..
ఈ ఘటనకు సంబంధించి అధికారులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ఆ ఇద్దరు నిందితులను ఉత్తరాఖండ్‌కు చెందిన అలీమ్ మహ్మద్ అక్తర్(30), చోటా మహ్మద్ నజీర్(40)లుగా గుర్తించారు. వారిని విచారించగా కొత్త బూటుల్లో రాజస్థాన్ నుంచి ముంబయికి డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు చెప్పారని అధికారులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 15 వరకు తమ కస్టడీకి పంపినట్టు ఏటీఎస్ తెలిపింది.
Source: EtvBharat





