News

అధికార లాంఛనాలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు

372views

ముంబై: భారత రత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్‌లో సైనిక, ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆదివారం పూర్త‌య్యాయి. అంతకు ముందు ముంబైలోని ఆమె ఇంటి వద్ద నుంచి మొదలైన అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఆమె పార్థివ దేహంపై జాతీయ పతాకాన్ని కప్పి, సైనిక వందనం సమర్పించారు. సాయంత్రం 6.15 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.

పండితుల మంతోచ్ఛారణల మధ్య సోదరుడు హృదయ్‌నాథ్ మంగేష్కర్ ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ తదితర రాజకీయ ప్రముఖులు ఆమెకు తుది వీడ్కోలు పలికారు. ఇన్ని రోజులపాటు తమ సోదరి తమతోనే ఉండేవారని, ఇప్పుడు ఆమె లేరని, తాము ఒంటరి వాళ్లమయ్యామని సోదరుడు, కుటుంబీకులు ఆవేదన చెందారు.

కడసారి చూపు కోసం  ముంబై పొద్దార్‌ రోడ్డులోని లత నివాసం ‘ప్రభు కుంజ్‌’ముందు అభిమానులు బారులు తీరారు. అక్కడి నుంచి శివాజీ పార్కు దాకా 10 కిలోమీటర్ల పొడవునా సాగిన అంతిమయాత్రకు అశేషంగా తరలివచ్చారు. అశ్రు నయనాలతో ఆమె పార్థివ దేహంతో పాటు సాగారు. లతా దీదీ అమర్‌ రహే అంటూ నినదించారు. చెట్లు, బిల్డింగుల పైకెక్కి అంతిమయాత్రను వీక్షించారు. లతాజీ నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర సాగింది.

భౌతికకాయం శివాజీ పార్క్‌కు చేరుకున్నాక ప్రధాని నరేంద్ర మోదీ లతా మంగేష్కర్‌ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె భౌతికకాయానికి పరిక్రమ [పూజతో చుట్టూ ప్రదక్షిణలు] నిర్వహించారు. ఈ సందర్భంగా లతా మంగేష్కర్ సోదరి, గాయని ఆశా భోంస్లే, ఆమె కుటుంబ సభ్యులకు ప్రధాని తన సంతాపాన్ని తెలిపారు.

కాగా, యావత్‌ దేశమంతా శోకసంద్రంలో ముగినిపోయింది. భారత ప్రధాని, రాష్ట్రపతి సహా పొరుగు దేశమైన పాకిస్థాన్, నేపాల్‌ దేశాధినేతలు సైతం ఆమెకు సంతాపం ప్రకటించారు.

లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆది, సోమవారాలను సంతాప దినాలుగా పేర్కొంది. రెండ్రోజులు జాతీయ జెండా అవనతం చేయనున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం నేడు సెలవు దినాన్ని ప్రకటించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి