
-
పొరుగు రాష్ట్రాల సరిహద్దు వివాదాలపై చర్చ
కాచర్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్.ఎస్.ఎస్)సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్‌తో సోమవారం అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాచర్ జిల్లాలోని సిల్చార్‌లోని ఆర్.ఎస్.ఎస్ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. మోహన్ భాగవత్ జనవరి 27 నుంచి సిల్చార్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్నారు. వీరి మధ్య సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగింది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆర్.ఎస్.ఎస్ ప్రధాన కార్యాలయం ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భాగవత్‌తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి స్థానికులతో సమావేశమయ్యారు.
అసోంలోని లఖీపూర్ పట్టణంలో 37కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, స్టేడియం నిర్మించనున్నట్టు సీఎం హిమంత శర్మ ప్రకటించారు. లఖీపూర్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ కార్యాలయం నిర్మాణానికి రూ.25 కోట్లు, స్టేడియం కోసం రూ.12 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం శర్మ చెప్పారు. అసోం రాష్ట్రంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కాచర్‌లోని సిబ్‌పూర్-లాఖీపూర్ రహదారిపై చిరి నదిపై షహీద్ నందచంద్ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నది వంతెన వద్ద షాహీద్ నందచంద్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం శర్మ వివరించారు.





