News

అవ‌మానం జ‌రిగినా.. సిగ్గు లేని పాకిస్తాన్‌!

550views
  • తాజాగా మ‌రికొన్ని సామాజిక మాధ్య‌మాలపై ఉక్కుపాదం

న్యూఢిల్లీ: భార‌త్‌పై పాకిస్తాన్ సామాజిక మాధ్యమాల వేదికగా నిత్యం విషం క‌క్క‌డంతో సంబంధిత‌ యూట్యూబ్, ట్విట్టర్, వెబ్సైట్, ఇన్ స్ట్రా ఖాతాలను భార‌త్ నిషేధించింది. అయితే, ఇంత అవ‌మానం జ‌రిగినా పాకిస్థాన్‌ సిగ్గులేకుండా ప్ర‌వ‌ర్తిస్తోంది. భారత్‌పై విద్వేషాన్ని ప్రదర్శించేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వద‌లడం లేదు. సరిహద్దుల్లో ఆగడాలు, ఉగ్రవాద దాడులతో ఇబ్బందిపెట్టే దాయాది దేశం… ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ఇండియాలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పాక్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ, భారత్‌పై విషప్రచారం చేస్తున్న 35 యూట్యూబ్‌ ఛానళ్లతోపాటు రెండు ట్విటర్‌ ఖాతాలు, రెండు వెబ్‌సైట్లు, రెండు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు, ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను తాజాగా కేంద్రం నిషేధించింది. ఇలా నిషేధించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.

జమ్మూ కశ్మీర్‌లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని పాక్‌ కేంద్రంగా సాగే యూట్యూబ్‌ ఛానళ్లు చిలవలు పలవలు చేసి చూపిస్తున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు, వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం, సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణం, భారత సైన్యం, భారత్‌-చైనా సంబంధాలు… ఇలా ప్రతి అంశంలోనూ మన దేశంపై దుష్ప్రచారమే లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయి. తాజాగా… నిషేధించిన 35 యూట్యూబ్‌ ఛానళ్లను అనుసరించే వారి సంఖ్య ఏకంగా 1.20 కోట్లకు పైనే ఉంది.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం-2021లోని కీలక సెక్షన్ల కింద వాటిపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని నియంత్రించడానికి భారత్‌ ఐటీ చట్టానికి పదును పెట్టడంతోనే నిషేధం వంటి కఠిన చర్యలు తీసుకోగలుగుతున్నామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనం కఠినంగా వ్యవహరిస్తుండటంతో సామాజిక మాధ్యమ సంస్థలు సైతం వాటిపై గట్టి చర్యలకు సిద్ధమవుతున్నాయి.

35 యూట్యూబ్‌ ఛానళ్లపై భారత్‌ నిషేధాన్ని ప్రకటించిన మర్నాడే గతంలో నిషేధించిన వాటిలో 19 ఛానళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ప్రసారం కాకుండా కట్టడి చేసినట్టు యూట్యూబ్‌ ప్రకటించింది. పాక్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మన ప్రయత్నాలకు ఇది నైతిక స్థైర్యాన్ని ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి సామాజిక మాధ్యమ సంస్థలనూ కేంద్ర ప్రభుత్వం నకిలీ వార్తల విషయంలో అప్రమత్తం చేస్తోంది.

నకిలీ వార్తలను, దేశంపై దుష్ప్రచారాన్ని నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని నేరుగా సామాజిక మాధ్యమ సంస్థలనూ హెచ్చరించడం ఇప్పుడు అత్యవసరం. లేదంటే పేర్లు, ఐపీ చిరునామాలు మార్చి దాయాది దేశ సంస్థలు మరో వైపునుంచి దాడిని కొనసాగించే ప్రమాదం ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి