
తిరుపతి: నేటి యువతకు మన సనాతన హైందవ ధర్మాన్ని, ఆర్ష ధర్మ సాంప్రదాయాలను తెలిపేందుకు టీటీడీ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు గణతంత్ర వేడుకల్లో అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తులలో భగవంతుణ్ణి దర్శిస్తూ అందించే సేవ నిజమైన భగవత్ సేవ అని ఉద్ఘాటించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో బుధవారం ఉదయం 73వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.
1980వ సంవత్సరం తరువాత తిరుమలలో పెద్ద ఎత్తున గదుల ఆధునీకరణ చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2 వేల వసతి గదుల అధునీకరణ పనులు పూర్తి చేశామని, త్వరలో మరో 1500 గదుల అధునీకరణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దాతల సహాకారంతో శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు అత్యాధునిక పరకామణి భవనాన్ని జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు.
అదేవిధంగా దాతల సహకారంతో రూ.25 కోట్లతో అలిపిరి నడక మార్గం పైకప్పు నిర్మాణ పనులు పూర్తి చేసి గత ఏడాది అక్టోబరు నుండి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఎస్వీబీసిలో 18 నెలల పాటు ప్రసారం అయిన గీతా పారాయణం కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు భగవద్గీతలోని శ్లోకాలను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.





