News

పర్యావరణ హితంగా నిర్మలమ్మ పద్దు

638views

* కాగితాలపై కాకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో బడ్జెట్…

కేంద్ర వార్షిక బడ్జెట్‌ ఈసారి కూడా కాగిత రహితంగానే ఉండబోతోంది. డిజిటల్‌గానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే బడ్జెట్‌ కాపీలను ముద్రించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గతంలో బడ్జెట్‌ అంటే పార్లమెంట్‌ సభ్యులకు, జర్నలిస్టులకు అందించడానికి వందలాది బడ్జెట్‌ ప్రతుల్ని ముద్రించాల్సి వచ్చేది. ఈ ముద్రణ కోసం పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌లోని ప్రింటింగ్‌ సిబ్బంది దాదాపు రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో బయటి వ్యక్తులెవర్నీ వారు కలిసే వీలుండదు. హల్వా వేడుకతో ఈ క్వారంటైన్‌ ప్రారంభమయ్యేది.

అయితే, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్‌ ప్రతుల ముద్రణను తగ్గించింది. పాత్రికేయులు, విశ్లేషకులకు పంపిణీ చేసే కాపీలను తగ్గించింది. గతేడాది కొవిడ్‌ మహమ్మారి విజృంభణ కారణంగా లోక్ ‌సభ, రాజ్యసభ సభ్యులకు కూడా ప్రతుల పంపిణీ నిలిపివేశారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ ఉద్దృతి నేపథ్యంలో హల్వా వేడుక కూడా నిర్వహించడం లేదు. అయితే, బడ్జెట్‌ డిజిటల్‌ డాక్యుమెంట్ల రూపకల్పన కోసం కొంతమంది సిబ్బంది మాత్రమే క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. పార్లమెంట్‌ సభ్యులు, సాధారణ ప్రజానీకం బడ్జెట్‌ డాక్యుమెంట్లను గతేడాది లాంచ్‌ చేసిన యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందొచ్చు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా నాలుగోసారి బడ్జెట్ ‌ను ప్రవేశపెట్టనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.