News

సమాజాన్ని సంఘటితం చేసే పనిలో సంఘ్‌

575views
  • డాక్ట‌ర్ మన్మోహన్ వైద్య

భాగ్య‌నగరం: భాగ్య‌నగరం(హైద‌రాబాద్)లో రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స్ఫూర్తి, ప్రేర‌ణతో వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న ప‌దాధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశాలు ముగిశాయి. ఈ నెల అయిదోతేదీ నుంచి మూడు రోజుల పాటు భాగ్య‌నగ‌రం శివారు అన్నోజిగుడా లో ఈ స‌మావేశాలు నిర్వహించారు.

స‌మ స‌మాజం కోసం స్వ‌యం సేవ‌కుల కృషి

స‌మావేశాల్లో 36 సంస్థ‌ల‌కు చెందిన 216 మంది పాల్గొన్నారు. ఈ స‌మావేశాలు ప్ర‌తీ సంవ‌త్సరం సెప్టెంబ‌ర్, జ‌న‌వ‌రి నెల‌ల్లో జ‌రుగుతాయ‌ని, వివిధ రంగాల్లో ప‌నిచేస్తున్న స్వ‌యంసేవ‌క్‌లు త‌మ అనుభ‌వాల‌ను, భ‌విష్య కార్య‌క్ర‌మాల‌ను ఇత‌రుల‌తో పంచుకోవ‌టం మాత్ర‌మే జ‌రిగింద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోర‌ని ఆయ‌న వివ‌రించారు. స‌మాజ సంఘ‌ట‌న ద్వారా స‌మ స‌మాజం కోసం స్వ‌యంసేవ‌క్‌లు కృషి చేస్తార‌ని తెలిపారు. గ‌త ఏడాది ఆరోగ్య రంగానికి సంబంధించి పోష‌కాహార లోపాన్ని అధిగ‌మించ‌టానికి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశామ‌ని, అలాగే ఆర్థిక రంగంలో ఉపాధి క‌ల్ప‌నపై కొన్ని సంస్థ‌లు దృష్టి పెట్టాయ‌ని, భారత్ కేంద్రిత విద్యా విధానంపై చర్చ జరిగిందని తెలిపారు.

మ‌రుగున ప‌డిన యోధుల చ‌రిత్ర‌ వెలికితీత

స్వాతంత్రానికి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మ‌రుగున ప‌డిన 250 మంది స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల చ‌రిత్ర‌ను వెలికి తీశామ‌ని, ఇందులో సమాజంలోని వివిధ వర్గాలతోపాటు ఎస్సీ, ఎస్టీలవారు ఉన్నారని చెప్పారు. వీటిని సంస్కార భార‌తి నాట‌కాల రూపంలో ప్ర‌చారం చేయనున్నద‌ని వెల్ల‌డించారు. సేవా సంస్థ‌లు దేశంలోని ఆరు వేల బ్లాక్ (మండల్) లలో 10 ల‌క్ష‌ల మందికి పైగా కార్య‌క‌ర్త‌ల‌కు కొవిడ్‌ను ఎదుర్కొనే క్ర‌మంలో శిక్ష‌ణ ఇచ్చిన‌ట్టు పేర్కొన్నారు.

దేశ‌వ్యాప్తంగా 55 వేల శాఖ‌లు

కొవిడ్ వ‌ల్ల శాఖ కార్య‌క్ర‌మాలు తాత్కాలికంగా ఆగిన‌ప్ప‌టికీ, తిరిగి పూర్తి స్థాయిలో పుంజుకొన్న‌ట్టు ఆయ‌న తెలిపారు. యువ‌తలో సంఘ కార్య‌క్ర‌మం ప‌ట్ల ఆస‌క్తి బాగా పెరిగింద‌ని, 2017-21 మ‌ధ్య కాలంలో ప్ర‌తీ సంవ‌త్స‌రం ల‌క్ష‌కు పైగా యువ‌త సంఘ్ కార్య‌క్ర‌మాల్లో పాలు పంచుకొనేందుకు పేర్లు న‌మోదు చేసుకొన్నార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 55 వేల శాఖ‌లు న‌డుస్తున్నాయ‌ని, వాటికి హాజ‌రు అయ్యేవారిలో 60 శాతం విద్యార్థులు, 40 శాతం ఉద్యోగులు ఉన్నార‌ని పేర్కొన్నారు.

విద్య.. చ‌రిత్ర‌, ఆధ్యాత్మిక‌త‌ను ప్ర‌తిబించించాలి

త‌ర్వాత విలేఖ‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌లకు మ‌న్ మోహ‌న్ వైద్య స‌మాధానాలు ఇచ్చారు. జాతీయ విద్యా విధానం భార‌తీయ చ‌రిత్ర ఆధ్యాత్మిక‌త‌ను ప్ర‌తిబింబించేట‌ట్టు ఉండాల‌ని, ఒకే విద్యా విధానం అనేది రాష్ట్రాల భిన్న‌త్వానికి ఏమాత్రం ఆటంకం కాద‌ని ఆయ‌న వివ‌రించారు. వైవిధ్యం అంటే విభేదాలు కావని, జాతి ఏకతకు అంతః సూత్రమైన అంశాలకు అనుగుణంగా ఈ విధానం ఉండాలని పేర్కొన్నారు.

కుల వివ‌క్ష‌ను రూపుమాపి, స‌మాజంలో స‌ద్భావ‌నను పెంపొందించ‌టానికి సామాజిక స‌మ‌ర‌స‌త సంస్థ కృషి చేస్తోంది… వివిధ సంస్థ‌లు త‌మ‌కు సంబంధించిన రంగాల గురించి అధ్య‌య‌నం చేసి, ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు స‌ల‌హాలు అందిస్తాయ‌ని, వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌టం ప్ర‌భుత్వం ప‌రిధిలోని అంశం అని ఆయ‌న వివరించారు. సమాజ జాగరణ అనేది సంఘ్ ప్రధాన కార్యమని, జాగృత‌ సమాజం ప్రభుత్వ విధానాలను ప్రభావం చూపుతుంద‌న్నారు. అందుకే సంఘ్ సమాజాన్ని సంఘటితం చేసే పనిలో ఉందని పేర్కొన్నారు.

ఈ స‌మావేశంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్‌చాల‌క్ డాక్ట‌ర్ మోహ‌న్ భాగ‌వ‌త్, స‌ర్ కార్య‌వాహ ద‌త్తాత్రేయ హోస‌బ‌ళెతో పాటు అయిదుగురు స‌హ స‌ర్ కార్యవాహలు పాల్గొన్నారు. విలేఖ‌ర్ల‌ స‌మావేశంలో స‌హ స‌ర్ కార్యవాహ డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ వైద్య స‌మావేశాల్లో చ‌ర్చించిన అంశాలు, విశేషాల‌ను వివ‌రించారు. ఆర్ఎస్ఎస్ అఖిల భార‌తీయ ప్ర‌చార ప్ర‌ముఖ్ సునీల్ అంబేక‌ర్ కూడా పాల్గొన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి