
-
సింధు పుష్కరాలకు తీసుకువెళ్ళిన ట్రావెల్ ఉద్యోగి పరార్
-
డబ్బులు కట్టాలని నిర్బంధించిన హోటల్ సిబ్బంది
-
దిక్కుతోచని స్థితిలో 250 మంది ఉత్తరాంధ్ర వాసులు
జమ్మూకశ్మీర్: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పాలకొండ, సోంపేట, చీపురుపల్లి తదితర ప్రాంతాల నుంచి జమ్మూకశ్మీర్ సింధు నది పుష్కరాలకు వెళ్ళిన సుమారు 250 మంది యాత్రికులు అక్కడి ఓ హోటల్‌లో చిక్కుకున్నారు. వీరంతా ఓ టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించి యాత్రకు వెళ్లారు. మూడు రోజులు వైష్ణోదేవి ఆలయం సహా కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కట్రాకు చేరుకున్నారు.
అక్కడ ఓ హోటల్లో ఉండగా టూరిజం సంస్థ వ్యక్తి కనిపించకుండా పోయాడు. బస చేసిందుకు డబ్బులు చెల్లించాలని హోటలు నిర్వాహకులు అడగడంతో అసలు విషయం వెలుగుచూసింది. టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించామని వాళ్లే అంతా చూసుకుంటామని చెప్పి, అర్ధాంతరంగా వదిలేశారని యాత్రకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు ఆవేదన చెందుతున్నారు. కట్రా కాంటినెంట్ హోటల్ యాజమాన్యం మనిషికి పది వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తోందని యాత్రికులు లబోదిబోమంటున్నారు.
Source: EtvBharat





