News

2022 ఆసియాన్‌-భారత్‌ ఐక్యత సంవత్సరం

573views
  • భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదితో ఆసియాన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జ‌రుపుకొందామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్‌- ఇండియా సమ్మిట్‌లో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియన్‌ దేశాలతో భారత్‌కు సుదీర్ఘ సంబంధాలున్నాయని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాల సమైక్యత భారత దేశానికి చాలా ముఖ్యమైనదని చెబుతూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారానికి భారత్‌, ఆసియాన్‌ దృక్పథాలు నిబంధనావళిగా ఉపయోగపడతాయని తెలిపారు.

ప్రపంచం ఇంకా కరోనాతో పోరాడుతోందని, మహమ్మారి కాలంలో భారత్‌ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొందని పేర్కొన్నారు. కొవిడ్‌ ప్రభావం ఆసియాన్‌ దేశాలు-భారత్‌ మధ్య స్నేహానికి సవాల్‌గా మారిందని తెలిపారు. ఈ సమయంలో పరస్పర సహకారంతోనే బంధం బలోపేతం చేయగలమని చెప్పారు. ఆసియాన్‌ దేశాలతో స్నేహమే భారత్‌కు ప్రధానం అని స్పష్టం చేశారు.

2022 నాటికి ఆసియన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 ఏళ్ళు… భారత్‌కు కూడా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతాయని ప్రధాని గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన మైలురాయికి గుర్తుగా ఆసియాన్‌-భారత్‌ ఐక్యతా దినోత్సవాన్ని జ‌రుపుకొందామ‌ని సంతోషం వ్యక్తం చేశారు.

18వ ఆసియాన్‌- భారత్‌ సమ్మిట్‌ కరోనా మహమ్మారి, అంతర్జాతీయ అభివృద్ధి, వ్యాపారాలు, ఇతర సమస్యలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్షిస్తుంది. ఆరోగ్యం, వాణిజ్యం, కనెక్టివిటీ, విద్య సంస్కృతి సహా కీలక రంగాల్లో సాధించిన పురోగతిపై చర్చించనున్నది.

నేడు విదేశీయాత్రకు ప్రధాని

కాగా, ఇటలీ, బ్రిటన్‌లో ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం బయలుదేరనున్నారు. పర్యటనలో ఆయన జీ-20 సదస్సులో పాల్గొంటారు. అక్టోబరు 30 నుంచి ఇటలీలో రెండు రోజుల సదస్సు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత యూకేలోని గ్లాస్గో పర్యటనకు వెళ్లనున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి