News

యోగి ఇలాఖాలో పాక్‌ వేషాలేస్తే దేశ ద్రోహం కేసులే..

505views

లక్నో: టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలుపొందితే సంబరాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ హెచ్చరించారు. టీ20 మ్యాచ్‌లో అక్టోబర్‌ 24న భారత్‌పై పాకిస్తాన్‌ విజయం సాధించిన అనంతరం దేశ వ్యతిరేక నినాదాలు చేసిన కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ విద్యార్థులను ఆగ్రాలో అరెస్ట్‌ చేశారు.

ఇప్పుడు యోగి ఆదిత్యానాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు విద్యార్థులపై స్థానిక బీజేపీ నేతలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కాలేజ్‌ అధికారులు వారిని సస్పెండ్‌ చేశారు. పాక్‌ విజయం అనంతరం సంబరాలు జరుపుకొన్న ఘటనలకు సంబంధించి ఆగ్రా, బరేలి, బదౌన్‌, సీతాపూర్‌ జిల్లాల్లో ఏడుగురిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

పాక్‌కు మద్దతు తెలుపుతూ ఆగ్రాలోని రాజా బల్వంత్‌ సింగ్‌ కాలేజీలో కాశ్మీరీ విద్యార్థులు సంబరాలు జరుపుకొన్నారు. విద్యార్థుల సంబురాలను నిరసిస్తూ కొందరు ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. విచారణ అనంతరం ముగ్గురు కశ్మీరీ విద్యార్థులను అరెస్టు చేశామన్నారు.

బరేలీకి చెందిన ఒక వ్యక్తి తన వాట్సాప్‌లో పాక్‌ అనుకూల స్టేటస్‌ను పెట్టడంతోపాటు అనుచిత ప్రవర్తనకు పాల్పడి బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. బరేలీకి చెందిన మరొకరు భారత క్రికెట్‌ జట్టును తిట్టి, తన వాట్సాప్‌ స్టేటస్‌లో పాక్‌ జట్టును ప్రశంసించారని ఆరోపించారు. బరేలీకి చెందిన మూడో వ్యక్తి తన ఫేస్‌బుక్‌ కవర్‌ పిక్చర్‌గా పాకిస్తాన్‌ జెండాను పెట్టుకున్నాడని.. సోషల్‌ మీడియాలో ఇతర పాకిస్తాన్‌ అనుకూల సందేశాలను పోస్ట్‌ చేశాడని ఆరోపించారు. వాట్సాప్‌లో పాక్‌ అనుకూల స్టేటస్‌ పెట్టినందుకు లక్నోకు చెందిన ఒకరిని అరెస్టు చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి