News

మావోయిస్ట్ హిడ్మా కోసం వేట‌!

560views

భాగ్య‌న‌గ‌రం: మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఏటూరునాగారం అడవుల్లో ప్రవేశించారనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల పోలీసులు ముప్పేట దాడికి సిద్ధమయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌ లోని అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్‌ హిడ్మాకు కరోనా సోకడంతో చికిత్స కోసం ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్టు సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లో చికిత్స పొందుతున్నట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికి త్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్‌ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్‌ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్‌ కెమెరాలను రంగంలోకి దింపాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి