
-
జమ్ము-కశ్మీర్‌లో ఘటన
కశ్మీర్: ముష్కరులను మట్టుబెట్టి, దేశాన్ని రక్షించాల్సిన ఆ ఉద్యోగులు వారితోనే చెట్టపట్టాలుగా తిరగడంతో వారి ఉద్యోగాలు ఊడాయి. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆరుగురి ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వీరిని డిస్మిస్ చేయాలని ప్రభుత్వం ఏర్పాటు కమిటీ సిఫార్సు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ టీచర్.. ఉగ్ర కమాండర్!
టీచర్ ఉద్యోగంలో చేరకముందు అబ్దుల్ హమిద్ వాని అల్లా టైగర్స్ ఉగ్రవాద సంస్థకు జిల్లా కమాండర్‌గా పనిచేసే వాడని అధికారులు తెలిపారు. పలుకుబడి ఉపయోగించి ఎలాంటి సెలక్షన్ ప్రక్రియ లేకుండానే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరినట్లు గుర్తించారు. బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ తర్వాత జరిగిన నిరసన కార్యక్రమాల్లో కీలక ప్రసంగాలు చేశాడని, వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు.
ఉగ్రవాద కానిస్టేబుల్
జమ్ము కశ్మీర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జాఫర్ హుస్సేన్ భట్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని 2019లో ఎన్‌ఐఏ అతడిని అరెస్టు చేసింది. అదే ఏడాది సెప్టెంబర్ 30న బెయిల్‌పై బయటకు వచ్చాడు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు తన కారును అందించాడన్నది ప్రధాన ఆరోపణ. ఇది తాజాగా రుజువైంది.
సకల సౌకర్యాలు
జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ రఫీ భట్.. కిష్టావర్‌లోని హిజ్బుల్ తీవ్రవాదులకు లాజిస్టిక్ సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఉగ్రవాదులు తమ ప్రణాళికలను అమలు చేసేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. ఇతడిని ఎన్‌ఐఏ గతంలోనే అరెస్టు చేయగా.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
దొంగ టీచర్!
లియాకత్ అలీ కక్రూ 1983 నుంచి బారాముల్లాలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. పలు ఆరోపణలపై 2001లో అరెస్టయ్యాడు. స్థానికంగా ఉగ్రశిక్షణ తీసుకున్నాడని అప్పుడు వెల్లడైంది. అతని వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సంరక్షణ చట్టం కింద 2002లో నిర్బంధించారు. 2021లో లియాకత్ నుంచి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
స్మగ్లింగ్ ఆఫీసర్
అటవీశాఖ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న తారిక్ మెహమూద్ కోప్ల్‌ా.. ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్నాడు. పాకిస్థాన్ నుంచి వచ్చే నకిలీ కరెన్సీ, డ్రగ్స్, పేలుడు పదార్థాలను ఉగ్రవాదులకు చేరవేస్తున్నాడు. ఉగ్రవాదులతో ఇతడు ఇప్పటికీ టచ్‌లో ఉన్నాడని అధికారులు తెలిపారు. 2010లో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లూటీ చేసే పోలీస్!
బుద్గాంకు చెందిన కానిస్టేబుల్ షౌకత్ అహ్మద్ ఖాన్.. తాను పని చేసే ఎమ్మెల్సీ ఇంట్లో నుంచి ఆయుధాలను లూటీ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీనిపై రాజ్‌బాఫ్‌ు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పీఎస్‌ఏ కింద ఇతన్ని నిర్బంధంలో ఉంచారు అధికారులు.
Source: EtvBharat





