
-
పెరగనున్న ఉపాధి, కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మైనింగ్ రంగంలో భారీ సంస్కరణలు చేపట్టింది. దీంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ సాకారానికి వంద ఖనిజాల బ్లాక్‌లను వేలానికి ప్రకటన చేసింది. ఈ గనుల వేలం ప్రక్రియను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, మైన్స్, బొగ్గు, రైల్వే సహాయమంత్రి రావు సాహెబ్ పాటిల్‌లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మైన్స్, బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. మైనింగ్ రంగంలో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద పీట వేశారని, సహజ వనరులను వినియోగించుకోవడంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ వెనుకబడిందని, అందుకే సంస్కరణలను తీసుకువచ్చామని వివరించారు. ప్రభుత్వం మైనింగ్ రంగంలో కొన్ని మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోందని అన్నారు.
ప్రస్తుత సంవత్సరంలో ఈ రంగంలో సంస్కరణలు, కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయన్నారు. వంద ఖనిజ బ్లాక్‌ల నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడం వల్ల దేశంలో ఖనిజాలు నిరంతరం సరఫరా అవుతాయని, మరిన్ని ఖనిజ బ్లాక్‌లను వేలంలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు మరింత ఆదాయం లభిస్తుందని ప్రహ్లాద్ జోషి చెప్పారు.





