
జమ్మూ కాశ్మీర్ లోని 14 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (N.I.A) సోదాలను నిర్వహించింది. జమ్మూలో ఇటీవల డ్రోన్ల దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో N.I.A ఈ సోదాలు నిర్వహిస్తోంది. రెండు కేసులకు సంబంధించి ఈ తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూ ఎయిర్ పోర్ట్ వద్ద ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ పై కొన్ని వారాల క్రితం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థ లష్కరే ముస్తఫాకు చెందిన మరో కేసులోనూ N.I.A సోదాలు నిర్వహిస్తోంది. సోఫియాన్, అనంతనాగ్, బనిహల్‌తో పాటు సుంజవాన్ లో N.I.A అధికారులు సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు.
జూన్ 27 న, జమ్మూలోని నర్వాల్ ప్రాంతం నుండి ఇద్దరు వ్యక్తులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. షోపియాన్ మరియు బనివాల్ నివాసితులైన నదీమ్ అయూబ్ రథర్, తాలిబ్ ఉర్ రెహ్మాన్ లను పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని హై సెక్యూరిటీ ప్రాంతంలో రెండు పేలుళ్లు సంభవించిన కొన్ని గంటల తర్వాత వారి అరెస్టు జరిగింది.విచారణలో మరో ఇద్దరు ఉగ్రవాదుల పేర్లను నదీమ్ వెల్లడించాడు. నిందితుడు జమ్మూలోని ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడాలని భావించాడు. కానీ అది వీలు పడలేదు. హోం మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం ఈ కేసుల దర్యాప్తును N.I.A కి అప్పగించింది. కాశ్మీర్ లోయలో జైషే మొహమ్మద్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అయిన లష్కరే ముస్తఫా చీఫ్ హిదయతుల్లా మాలిక్ ను ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 న జమ్మూలో అరెస్టు చేశారు. N.I.A దగ్గరున్న సమాచారం ప్రకారం, జమ్మూ కాశ్మీర్‌లో భారీ దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.





