ArticlesNews

జీవితాన్ని దేశసేవకే అంకితం చేసిన ప్రొ. రజ్జూభయ్యా

792views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తృతీయ సర్ సంఘచాలక్ శ్రీ బాలాసాహెబ్ దేవరస్ అనారోగ్యం పాలైన కారణంగా వారు 1994 మార్చి 11న శ్రీ రాజేంద్రసింహజీని తన తర్వాతి సర్ సంఘచాలక్ గా నియుక్తి చేశారు. సంఘ చరిత్రలో మొట్టమొదటగా సర్ సంఘచాలక్ జీవించి ఉండగా అతని వారసుని ప్రకటించడం జరిగింది. అందరిచే రజ్జూభయ్యాగా పిలువబడే ప్రొఫెసర్ రాజేంద్రసింహజీ ఆరోజు నుండి నాల్గవ సర్ సంఘచాలక్ అయ్యారు. శ్రీరజ్జూభయ్యా క్రీ.శ. 1922లో జన్మించారు. వారి తండ్రి కుంవర్ బలవీర్ సింహ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరుగా పనిచేశారు. రజ్జూభయ్యా ప్రాథమిక విద్యాభ్యాసం నైనిటాల్ లో జరిగింది. మెట్రిక్ పరీక్ష ఉన్నావ్ గ్రామం నందు ఉత్తీర్ణులయ్యారు.

ఆ తరువాత విద్యాభ్యాసం ప్రయాగ విశ్వవిద్యాలయంలో పూర్తయింది. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే ప్రయాగ విశ్వవిద్యాలయం నుండి ద్వితీయశ్రేణిలో ఉత్తీర్ణులై యం.యస్.సి. పట్టా పొందారు. ఆ వెనువెంటనే అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యుని (ప్రొఫెసర్)గా నియుక్తి అయ్యారు. ఉత్తర ప్రదేశ్ లో సంఘకార్యం పెరుగుదల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని 1966లో వారు స్వచ్చందంగా భౌతికశాస్త్ర అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసి సంఘ ప్రచారక్ అయ్యారు. 1978లో వారు సర్ కార్యవాహగా బాధ్యత స్వీకరించి 1987 వరకు అదే బాధ్యతలో కొనసాగారు. అనారోగ్య కారణాల వలన 1987లో ఆ బాధ్యత వదలిపెట్టి నూతన సర్ కార్యవాహ శ్రీహె.వె.శేషాద్రిగారికి సహకారిగా, సహసర్ కార్యవాహ బాధ్యతలో కొనసాగారు.

1994, మార్చి 11న జరిగిన అఖిల భారత ప్రతినిధి సభల సందర్భంగా శ్రీ రజ్జూభయ్యా నాల్గవ సర్ సంఘచాలక్ గా నియుక్తులయ్యారు. విదేశాలకు వెళ్ళి అక్కడ సంఘ కార్యాన్ని పరిశీలించిన మొదటి సర్ సంఘచాలక్ శ్రీ రాజేంద్రసింహజీ. ఈ పనిమీద ఇంగ్లాండ్, మారిషస్, కెన్యా, దక్షిణాఫ్రికా మొదలగు దేశాలలో వారు పర్యటించారు.

1999, ఫిబ్రవరి నెలలో శ్రీ రాజేంద్రసింహజీ పూనా పర్యటనకు వచ్చినపుడు ఉన్నట్లుండి జారి క్రింద పడటంతో సడుము ఎముక విరిగింది. ఈ కారణంగా ఆ సంవత్సరం లక్నోలో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ బైఠక్ లలో వారు పాల్గొనలేక పోయారు. ఆ తరువాత వారు పూర్తిగా కోలుకోలేకపోవడం, దానితోపాటు మాట్లాడటంలో ఇబ్బంది కలగడంతో వారు తన బాధ్యత నుండి విముక్తి కావాలని భావించారు. 2000 మార్చి 30న నాగపూర్ లో జరిగిన అఖిలభారత ప్రతినిధి సభలో తన వారసునిగా పరమపూజనీయ కుప్పనహళ్లి సీతారామ సుదర్శన్ జీని సర్ సంఘచాలక్ గా నియుక్తి చేసారు. శ్రీ రాజేంద్రసింహజీ 2003 జూలై 14న పూనాలో స్వర్గస్థులైనారు.

Mega Minds సౌజన్యంతో….

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.