భారత్ లో ఐఎస్ఐఎస్ భారీ కుట్ర… అతివాద ఇస్లామ్ ప్రచారానికి పన్నాగం… భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ..

నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ ప్రచారాన్ని వ్యాప్తి చేసిన కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్, అనంత్‌నాగ్‌లలో ఏడు చోట్ల ఆదివారం సోదాలు నిర్వహించింది. జమ్మూ-కశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సహాయంతో కశ్మీర్ లోయలోకి వెళ్లిన ఎన్‌ఐఏ.. ఐఎస్‌ఎస్‌ఎస్ ముఠా గుట్టును రట్టుచేసింది. ఇందులో భాగంగా తొమ్మిది మంది అనుమానితులను ప్రశ్నించి.. ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. భారత్‌పై హింసాత్మక జిహాద్ ప్రకటించేందుకు.. ముస్లిం యువతలో ఉగ్రవాద భావాలు చొప్పించి.. ఉగ్రవాదులను చేసేందుకు ఐఎస్‌ఐఎస్ కుట్రకు సంబంధించి జూన్ 29న కేసు నమోదైనట్లు ఎన్‌ఐఏ అధికార ప్రతినిధి ఆదివారం తెలిపారు. ఆన్‌లైన్‌లో నెలకోమారు ప్రచురితమయ్యే.. ‘ద వాయిస్ ఆఫ్ హింద్’లో దోషపూరితమైన కథనాలు ప్రచురితమైనట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.
భారత్‌లో అన్యాయం జరిగిపోతోందంటూ అసత్య కథనాలు, యువతలో తాము స్వదేశంలోనే పరాయివారమన్న భావన కలిగించేలా, మతపరమైన విద్వేషాన్ని పెంచేలా ఉండే కథనాలు ‘ద వాయిస్ ఆఫ్ హింద్’ ప్రచురించేది. ఇందుకోసం చేపట్టిన ఆన్‌లైన్ ప్రచారానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారి నుంచి నిధులు అందేవి. ఆదివారం నాటి సోదాల్లో భారీ ఎత్తున ఉగ్రవాద సాహిత్యంతో నిండిన పత్రాలు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డిస్క్‌లు, ఐఎస్ఐఎస్ చిహ్నం ముద్రించిన దుస్తులు లభించినట్లు ఎన్ఐఏ ప్రతినిధులు తెలిపారు. ఈ సోదాల్లో ఎన్ఐఏకు నిఘా విభాగం (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) లు సహకరించాయి.





