News

నిబంధనలను పాటించిన సామాజిక మాధ్యమ సంస్థలను అభినందించిన న్యాయ శాఖా మంత్రి

563views

భారత్‌లో కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన తర్వాత ఫేస్‌బుక్‌, గూగుల్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్రముఖ మాధ్యమాలు అసభ్యకర పోస్టులను తొలగించడం అభినందనీయమని, దీంతో పారదర్శకత దిశగా ముందడుగు పడిందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ” కేంద్రం తీసుకొచ్చిన నిబంధనలను గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పాటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయా మాధ్యమాల్లో పోస్టుచేసిన అసభ్యకర సందేశాలను తొలగించడంతో పారదర్శకత దిశగా ముందడుగు పడినట్లయింది” అంటూ రవిశంకర్‌ ప్రసాద్‌ ట్వీట్‌ చేశారు. నూతన ఐటీ నిబంధనల ప్రకారం తొలి నెలవారీ పారదర్శక నివేదికను ఫేస్‌బుక్‌ ఇవాళ విడుదల చేసిన విషయం తెలిసిందే.

సామాజిక మాధ్యమాలకు సంబంధించి డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణ కోసం కేంద్రం మే 26న కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటిని పాటించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ ట్విటర్‌ మాత్రం అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థ మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయింది. మరోవైపు నిబంధనలు అమలు చేసిన తర్వాత 10 కేటగిరీల కింద 3 కోట్లకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. 20 లక్షలకు పైగా కంటెంట్లపై చర్యలు తీసుకున్నామని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. ఇటీవల దాదాపు 60 వేల కంటెంట్లను తమ మాధ్యమం నుంచి తొలగించామని గూగుల్ చెప్పుకొచ్చింది. ఇందులో అత్యధికంగా 96శాతం కాపీరైట్‌కు సంబంధించినవేనని వెల్లడించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.