
పవిత్ర కృష్ణా తీరం ఎన్నో పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలకు నిలయం. రాచరికపు ఆనవాళ్లు ఆధ్యాత్మిక వైభవం ఈ ప్రాంతం సొంతం. వాటిలో ఇంద్రకీలాద్రి సమీపంలోని ఉండవల్లి గుహలది ప్రత్యేక స్థానం. అందులో వెలసిన అనంతపద్మనాభస్వామి ఆలయం అలనాటి శిల్పకళా వైభవానికి చిరస్మరణీయ చిహ్నం. దుర్గమ్మ దర్శనాంతరం సరదాగా సేదతీరేందుకు సరైన గమ్యస్థానం. 20 అడుగుల ఏకశిల విగ్రహంతో పర్యాటకులకు స్వాగతం పలుకుతున్న ఉండవల్లి గుహల గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉండవల్లి గుహల ప్రత్యేకతలు: చుట్టూ ఆకుపచ్చని పంట పొలాలు, సమీపంలోనే కృష్ణా జలాల సవ్వడులు, ఒకే కొండను ఉలితో చెక్కిన నాలుగు అంతస్తులు. శయన రూపంలో భక్తులకు దర్శనమిచ్చే అనంతపద్మనాభస్వామి ఏక శిల. ఇవి అమరావతి రాజధానికి ముఖద్వారంగా ఉన్న ఉండవల్లి గుహల విశిష్టతలు. ప్రశాంతమైన ప్రదేశంలో వెలసిన అద్భుతమైన శిల్పకళా సంపద ఉండవల్లి గుహల ప్రత్యేకత.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి అతి ప్రాచీనమైన, చరిత్ర ప్రసిద్ధి చెందిన గ్రామం. విజయవాడ ప్రకాశం బ్యారేజి దాటి మంగళగిరి రహదారి పై కొద్దిగా ముందుకు వెళ్లి అమరావతి రోడ్డులో 5 కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి శ్రీ అనంతపద్మనాభ స్వామి గుహాలయాలు వెలసి ఉన్నాయి. ఉండవల్లి గుహలుగా ప్రసిద్ధి చెందిన ఈ గుహాలయాలు క్రీ.శ 420 -620 ప్రాంతంలో ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల కాలం నాటి నిర్మాణాలుగా చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. విష్ణు కుండినులు మొదట్లో బౌద్ధమతానుయాయులుగా అనంతరం హిందూమతాన్ని ప్రోత్సహించినట్లు చరిత్ర చెపుతోంది.
ఆహా అనిపించేలా నిర్మాణ శైలి: గుహాలయాల నిర్మాణ కౌశలం చూస్తే ఆహా అనిపిస్తుంది. ఒకే కొండను నాలుగంతస్తుల గుహాలయాలుగా, విశాలమైన విహారాలుగా, మందిరాలుగా, అందమైన స్థంభాలుగా, బౌద్ధ, శైవ, వైష్ణవ దేవతామూర్తులుగా వివిధ ఆకృతుల్లో మలచి ఉండడం చూస్తుంటే ఆనాటి శిల్పుల అనన్య శిల్ప నైపుణ్యానికి ఎవరైనా వందనాలు సమర్పించాల్సిందే. గుహాలయంలో శ్రీ అనంత పద్మనాభుని 20 అడుగుల ఏకశిలా విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది.
చరిత్రకు సజీవ సాక్ష్యాలు: క్రీస్తుశకం 5, 6 శతాబ్దాల కాలంలో విష్ణుకుండినుల ఏలుబడిలో ఉండవల్లి గుహులను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. మొదట్లో బౌద్ధ, జైన ఆలయాలుగా ఉన్న ఈ గుహలు అక్కడ అనంతపద్మనాభ స్వామి విగ్రహ ఏర్పాటుతో గుహాలయాలుగా రూపాంతరం చెందాయి. విష్ణుకుండినుల కాలం నాటి చరిత్రను, విశేషాలను శాసనాల రూపంలో కొండపై మలిచారు. కొండపై ఏ ప్రాంతం చూసినా అద్భుత కళాఖండాలు, శిలా రూపాలు వందల ఏళ్లనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఉండవల్లి గుహాలు అంటే ప్రధానంగా గుర్తొచ్చేది అనంతపద్మనాభస్వామి శయన రూపమే. సుమారు 20 అడుగులు పొడవైన ఈ భారీ విగ్రహాన్ని ఒకే రాతి శిలను తొలచి తీర్చిదిద్దారు.
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి: అటు ఆధ్యాత్మికం ఇటు పర్యాటకంతో ఉండవల్లి గుహాలు సందర్శకులకు ఆహ్వానం పలుకుతున్నాయి. సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్న ఉండవల్లి గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. గుహలకు అదనపు హంగులు జోడించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. తద్వారా పర్యాటకుల తాకిడి పెరిగి ఈ ప్రాంతానికీ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.





