News

భారతీయ కంటెంట్ ప్రసారం చేసిన పాక్ న్యూస్ ఛానెల్‌కు షోకాజ్ నోటీసు

46views

పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) ‘జియో న్యూస్’ ఛానెల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఆశా భోంస్లే  మరణించారనే   వార్తను ప్రసారం చేసే క్రమంలో ఆ ఛానెల్ భారతీయ కంటెంట్‌ను చూపించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలు, పాటలు, వినోద కార్యక్రమాల ప్రసారంపై పూర్తిస్థాయి నిషేధం అమల్లో ఉంది. ఈ క్రమంలోనే ఆశా భోంస్లే మరణ వార్తను కవర్ చేసే సమయంలో సదరు పాక్ ఛానెల్ ‘జియో న్యూస్’ ఆమె పాడిన పాటలను, భారతీయ వీడియో క్లిప్పింగులను ప్రసారం చేసింది. దేశీయ చట్టాలను ఉల్లంఘిస్తూ నిషేధిత భారతీయ కంటెంట్‌ను ప్రదర్శించినందుకు గాను ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ ఛానెల్‌ను పెమ్రా ఆదేశించింది.

కీలుబొమ్మ అంటూ నెట్టింట విమర్శలు..

అయితే.. భారతీయ కంటెంట్‌ను ప్రసారం చేశారన్న సాకుతో నోటీసులు ఇవ్వడాన్ని పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. పెమ్రా కేవలం పాకిస్థాన్ ఆర్మీ (Pakistan Army) చేతిలో కీలుబొమ్మలా మారుతోందని, కళాకారులకు నివాళులర్పించడాన్ని కూడా నేరంగా చూడటం ఏంటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. భారతీయ సంస్కృతి, కంటెంట్ పట్ల పాక్ ఆర్మీకి ఉన్న భయానికి ఇది నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.