
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని.. ఈ మేరకు కేంద్ర ఆయుష్ ఇన్చార్జి మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచనలు చేశారు. కిరణ్ రిజిజు, బలరామ్ భార్గవ్ లకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై వారితో చర్చించారు. వెంటనే అధ్యయనం ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ చూపాలని వారికి తెలిపారు.
సీఎం ఆదేశాలు…..
ఆయుర్వేద మందుపై గందరగోళం తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆయన స్పష్టం చేశారు.
ఐసీఎంఆర్ బృందం పర్యటన……
ఉపరాష్ట్రపతి, సీఎం ల సూచనలతో కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయతను నిర్ధారించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) బృందం అక్కడికి చేరుకుంది. ఆయుర్వేద మందుపై అధ్యయనం చేసి శాస్త్రీయతను పరీక్షించనుంది.





