News

మనం ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది – మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

557views

నం ప్రకృతి హిత జీవనాన్ని అనుసరిస్తే ప్రకృతి మనల్ని సంరక్షించి పోషిస్తుందని ప్రధాని మోడీ ఆదివారం (31/1/2021) జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రకృతిని నాశనం చేయకుండా సరియైన పద్ధతిలో వినియోగించుకుంటే ప్రకృతి ప్రజలను తల్లిలా కాపాడుతుందని, చక్కటి ఆదాయాన్ని సమకూరుస్తుందని, పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. అందుకు ఉదాహరణగా ఆయన అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ ప్రాంతంలో నివసించే కొండ జాతి ప్రజల జీవన విధానాన్ని ఉదాహరణగా చూపారు.

అరుణాచల్ ప్రదేశ్ లోని కొండ ప్రాంతం తవాంగ్ లో శతాబ్దాలుగా ‘మోన్ షుగు’ అనే కాగితం తయారవుతుంది. తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుండి 448 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం.

తవాంగ్ వద్ద ఉన్న స్థానికులు ‘మోన్ షుగు’ అనే కాగితాన్ని తయారు చేస్తారు. దీనిని ‘షుగు షెంగ్’ అనే మొక్క యొక్క బెరడు నుండి చేతితో తయారు చేస్తారు. ఈ కాగితం తయారు చేయడానికి చెట్లను నరకవలసిన అవసరం లేదు. అంతేకాకుండా, ఈ కాగితాన్ని తయారు చేయడానికి ఎటువంటి రసాయనాన్ని ఉపయోగించరు. అందువల్ల ఈ కాగితం పర్యావరణానికి మరియు ఆరోగ్యానికి కూడా సురక్షితం.

ఈ కాగితం ఎగుమతి చెయ్యడానికి ఎంతో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ పెద్ద పెద్ద పరిశ్రమలలో, ఆధునిక పద్ధతులలో, పెద్ద మొత్తంలో కాగితం తయారు చేయడం ప్రారంభించడంతో ఈ స్థానిక కళ దాదాపుగా అంతరించి పోయే స్థితికి చేరింది. దాంతో స్థానిక గిరిజనులు ఉపాథి కోల్పోయారు. ఇప్పుడు ‘గొంబు’ అనే ఒక స్థానిక సామాజిక కార్యకర్త ఈ కళను గురించి స్థానికులలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో ఇప్పుడు అక్కడ కాగితం తయారీ తిరిగిప్రారంభమైంది. అక్కడ నివసించే గిరిజనులకు ఇప్పుడు ఉపాధి లభిస్తోంది.

నిన్న జరిగిన మన్ కీ బాత్ 2.0 లో ప్రధాని మోడీ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణ పరిరక్షణ ఆదాయ మార్గాలను ఎలా చూపిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని కూడా ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.