ArticlesNews

మనిషి మాయమైపోలేదని ఋజువు చేసిన మహిళా ఎస్సై

485views

“మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ” అని ఎవరో పాడేస్తుంటే విని అయ్యో లోకంలో మనం తప్ప మానవత్వం ఉన్న మనిషి ఇంకొకడు లేడని తెగ బాధపడిపోతూ ఉండేవాళ్ళం ఇన్నాళ్ళూ. ఎందుకంటే లోకంలో/లోకానికి మంచి చేసిన వాళ్ల గురించి మన మీడియాలో గానీ, సినిమాల్లో గానీ, టీవీల్లో గానీ చూపడం, చెప్పడం బహు అరుదు. లోకమంతా కుళ్ళి పోయింది, మానవత్వం మాడి మసై పోయింది అని చెప్పడమే, అలా చూపడమే వారి పరమ లక్ష్యం. దాని వెనక వారి అజెండాలు వారికున్నాయనుకోండి.

కానీ ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి విషయాలన్నీ బయటికి వస్తున్నాయి. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో కూడా సమాజంలో కాస్తోకూస్తో ఆర్థిక పుష్టి కలిగిన వారందరూ తమ తోటి ప్రజలకు అంతో ఇంతో సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అలాగే సుదూర ప్రాంతాలకు కాలి నడకన బయలుదేరిన వలస కార్మికులకు కూడా దారిపొడవునా చేతనైన చేయూతనందించారు. ఆ విధంగా చేయడం ద్వారా మనుషులలో మానవత్వం నశించి పోయిందంటూ కొందరు మేథావులు అదే పనిగా ఏడున్నర దశాబ్దాలుగా సాగించిన దుష్ప్రచారానికి తెరదించారు భారత ప్రజానీకం.

ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అది కూడా మన తెలుగు నేలలో…..  అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేమిటంటే…….

ఓ మహిళా ఎస్సై అనాథ శవాన్ని తానే స్వయంగా భుజంపై మోసుకెళ్లారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కాశీబుగ్గ సమీపంలోని అడవి కొత్తూరు గ్రామంలో 60 ఏళ్ల గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందినట్లు ఎస్సై శిరీషకు సమాచారం అందింది. దీంతో ఈరోజు (1/2/2021) ఆమె అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

దీంతో ‘లలిత చారిటబుల్‌ ట్రస్ట్’‌ నిర్వాహకుల సాయంతో మృతదేహాన్ని ఎస్సై శిరీష తన భుజంపై మోసుకుంటూ పొలంగట్ల మీదుగా సుమారు 2కి.మీ తీసుకెళ్లి సమీపంలోని రోడ్డుపైకి చేర్చారు. అనంతరం మృతదేహాన్ని ట్రస్ట్‌ సభ్యులకు అప్పగించడంతో వారు అంత్యక్రియలు నిర్వహించారు. ఓ మహిళా ఎస్సై అనాథ మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ వెళ్లడాన్ని చూసిన పలువురు ఆమెను అభినందిస్తున్నారు. మానవత్వం చాటుకున్న ఎస్సై శిరీషను ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర అధికారులు అభినందించారు. మృతదేహాన్ని ఎస్సై మోసుకెళ్తున్న వీడియోను ఏపీ పోలీస్‌శాఖ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే….. గత ఏడున్నర దశాబ్దాలుగా కొందరు మేధావులు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ, మనల్ని ఏడిపిస్తూ చేసిన ప్రచారం నిజం కాదు. నిజానికి సమాజంలో అప్పుడూ, ఇప్పుడూ మానవత్వం నిలచే ఉంది. ఎప్పటికీ పరిమళిస్తూనే ఉంటుంది. ఎందుకంటే….. మానవత్వానికి, మంచితనానికి, ఔదార్యానికి పుట్టినిల్లు ఈ భూమి. ఈ పుణ్యభూమిలో మానవత్వానికి మరణం లేదు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.